ఎస్‌ఐ రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

Nov 27 2026 1:26 AM | Updated on Nov 27 2026 1:26 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో ఈనెల 29న నిర్వహించనున్న ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎస్పీ డి.జానకి అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు, అవాంచనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించాలని సూచించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, పోలీస్‌ నోడల్‌ అధికారులు, బయోమెట్రిక్‌ సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈనెల 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకే సెషన్‌లో పరీక్ష ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, సాంకేతిక కారణాలతో డిజిటల్‌ బయోమెట్రిక్‌ నమోదు కాకపోతే మాన్యువల్‌ విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. పరీక్ష విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది, పోలీసులు మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను తమ వద్ద ఉంచుకోరాదన్నారు. నిబంధనల ప్రకారం చీఫ్‌ సూపరింటెండెంట్‌కు మాత్రమే ఫోన్‌ అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమల్లో ఉంటుందని, ఐదుగురికి మించి గుమిగూడరాదని తెలిపారు. సమీపంలోని జిరాక్స్‌, ఇంటర్నెట్‌ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 24 గంటల పాటు సీసీటీవీ నిఘాతోపాటు సాయుధ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సామగ్రి తరలింపులో పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సమావేశంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ సురేష్‌కుమార్‌, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్‌, కమలాకర్‌, ఇతర కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఐటీ సెల్‌ ఎస్‌ఐ రవి, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ @ రూ.3,734

దేవరకద్ర: స్థానిక మార్కెట్‌ యార్డులో గురువారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.3,734, కనిష్టంగా రూ.3,203గా ధరలు లభించాయి. కేఎన్‌ఎం ధాన్యం గరిష్టంగా రూ.3,059, కనిష్టంగా రూ.2,609గా ధరలు నమోదు కాగా.. మార్కెట్‌కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

● అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకుచేరుకోవాలి : ఎస్పీ డి.జానకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement