● నల్లమలలో రూ.150 కోట్లతో మౌలిక వసతుల కల్పన
● రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
అచ్చంపేట: ప్రజలకు ప్రాణవాయువు లాంటి విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జిల్లాలోని నల్లమల ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అచ్చంపేటలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్లో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్‌వి పాటిల్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నల్లమలలో విద్యుత్ వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సుమారు రూ.150 కోట్లతో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో సుమారు రూ.78 కోట్ల విలువైన పనులు చేపట్టామని వివరించారు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వ్యవసాయం, తాగునీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వీటికి అనుగుణంగా విద్యుత్ డిమాండ్ పెరిగినా.. సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు తావివ్వకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలన్నారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.
తాగునీటి కొరత రానివ్వొద్దు..
ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లాలోని రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, అవసరమైన చోట్ల చెరువులు, కుంటలను నింపే చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే రెండేళ్లకు అవసరమైన ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయని.. ఆహార కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అభివృద్ధి జంక్షన్‌గా అచ్చంపేట..
నల్లమల ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్, యంగ్ ఇండియా స్కూల్, దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం వంటి అభివృద్ధి కార్యక్రమాలతో అచ్చంపేట నియోజకవర్గం అతిపెద్ద అభివృద్ధి జంక్షన్‌గా మారబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వీలైనంత త్వరలో ఎకో టూరిజం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వలో రానన్ని ట్రాన్స్ఫార్మర్లు ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. మన్ననూర్‌లో రూ. 74కోట్లతో ఏర్పాటుచేస్తున్న 220/33 కేవీ సబ్‌స్టేషన్‌తో మరో 50 ఏళ్ల వరకు విద్యుత్ సమస్య ఉండదన్నారు.


