గట్టు: పాలమూరు ప్రజలకు కరువు తెచ్చి, రైతులను కన్నీరు పెట్టించడంతో పాటు బేడీలు వేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కర్ణాటకలోని యాదగిరి ప్రాంతానికి వలస వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గట్టు మండలంలోని ఇందువాసి గ్రామానికి చెందిన ఏసేపు, నాగన్న కుటుంబాలతో పాటు క్షతగాత్రులను బుధవారం ఆయన పరామర్శించారు. ఇందువాసికి చెందిన దళిత వలస కూలీలు మృతి చెందితే సీఎం రేవంత్‌రెడ్డికి పట్టదని.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు పరామర్శించేందుకు తీరక లేదంటూ ఆరోపించారు. కనీసం కలెక్టర్, ఇతర అధికారులు కూడా బాధిత కుటుంబాలను ఇప్పటి దాకా పరామర్శించక పోవడం దారుణమన్నారు. ఓవైపు తుంగభద్ర, మరోవైపు కృష్ణానదులు ఉన్నా ఇందువాసి గ్రామానికి సాగునీరందని దుస్థితి ఉందన్నారు. అందుకే ఇక్కడ దళిత కుటుంబాలు వలస బాట పట్టాయని ఆరోపించారు. ఎండుతున్న పంటలను చూడలేక జూరాల వద్ద ఆందోళనకు దిగితే ప్రభుత్వం రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి, బేడీలు వేయిస్తోందని ఆరోపించారు. సాగునీరు లేకపోవడం, కరెంటు సక్రమంగా ఇవ్వక పోవడంతో కరువు వచ్చి వలసలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూలీలకు రూ.12వేల సాయం ఏమైందని ఆయన ప్రశ్నించారు. కూలీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దగా చేసిందని ఆరోపించారు.
● గట్టు సబ్‌స్టేషన్ నుంచి వ్యవసాయానికి అందిస్తున్న కరెంటుకు సంబంధించిన రికార్డులను హరీశ్‌రావు పరిశీలించారు. 7:16 గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేసిన విషయాన్ని గుర్తించారు. మద్యలో 3 పర్యాయాలు కరెంట్ కట్ చేసినట్లు స్పష్టమైంది. అక్కడి నుంచి రాయపురం స్టేజీ వద్ద ఎండిన వరిపంటను ఆయన పరిశీలించి, రైతుతో మాట్లాడారు. కరెంట్ సక్రమంగా లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నట్లు రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. కాగా, రాయాపురంలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కోసం 60 ఎకరాలు సేకరిస్తున్నారని.. సాగు భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో కరువు
మాజీ మంత్రి హరీశ్‌రావు
ఇందువాసిలో వలస కూలీల కుటుంబాలకు పరామర్శ


