అలంపూర్: బ్రహ్మచారిణి మాత నమోస్తుతే.. అంటూ భక్తులు అమ్మవారిని స్మరించుకుంటూ వేడుకున్నారు. అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ అమ్మవారి శరన్న నవరాత్రి ఉత్సవాల రెండోరోజు సోమవారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. జోగుళాంబ మాత బ్రహ్మచారిణి దేవీ అలంకారంలో అమ్మవారు భక్తుల చేత విశేష పూజలందుకున్నారు. శక్తిపీఠంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక మండపంలో బ్రహ్మచారిణి దేవిగా కొలువుదీర్చారు. అర్చక స్వాములు అమ్మవారికి విశేష పూజలు చేశారు. అమ్మవారికి కొలువు పూజ, దర్బారు సేవ, కుమారి పూజ, సువాసినీ పూజల అనంతరం మహా మంగళహారతి, నీరజన మంత్ర పుష్పముల వంటి విశేష పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో రెండోరోజు జోగుళాంబ మాతను బ్రహ్మచారిణి మాతగా ఆరాధిస్తారని అర్చక స్వాములు తెలిపారు. అమ్మవారు దేవత శుద్ధ స్పటిక వర్ణములతో ప్రకాశించే స్వభావాన్ని కలిగి ఉంటారని భక్తులకు తెలిపారు. అమ్మవారి చేతిలో పుస్తకం, జపమాల, కమండలం, దండం కలిగి ఉంటారని వివరించారు. అమ్మవారిని పూజించే భక్తులకు ప్రత్యేక శక్తి కలుగుతుందన్నారు. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల జీతంలో ఎదురయ్యే అనేక ఒడిదూడుకులను ఎదుర్కొనే శక్తి సిద్ధిస్తుందని అర్చకులు వివరించారు.
నవరాత్రి నిత్యపూజలు
జోగుళాంబ అమ్మవారి ఆలయంలో నవరాత్రిని పురస్కరించుకొని నిత్యపూజలు జరిగాయి. నిత్యానుష్ఠానం, ఆవాహితా దేవత హోమాలు, నిత్య బలిహరణ, అర్చనలు, నీరాజన మంత్ర పుష్పములు, అమ్మవారికి నవాన్న సహిత మహానివేదన, బలిహరణ సమర్పణ వంటి పూజలు ప్రత్యేకంగా జరిగాయి. యాగశాలలో నిత్యానుష్ఠానం, ఆవాహిత దేవత హోమాలు, నిత్య బలిహరణ పూజలతో ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలోని మండపంలో కుంకుమార్చన పూజలు, యాగశాలలో చండీహోమాలు కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం రథోత్సవం కనులపండవగా నిర్వహించారు.
త్రిశతి కుంకుమార్చనలు
శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలోని ప్రత్యేక మండపంలో త్రిశతి నామసహిత కుంకుమార్చనలు సామూహికంగా నిర్వహించారు. కర్నూలుకు చెందిన స్వర్ణగౌరి గ్రూప్ మహిళలు త్రిశతి నామ సహిత కుంకుమార్చనలు నిర్వహించారు. 150మంది మహిళలు కుంకుమార్చనలో సాముహికంగా పాల్గొన్నారు. అమ్మవారికి మాంగళ్యం సమర్పించినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు.
ఉత్సవాలలో హరికథ గానం
దేవీశరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో హరికథ గానం నిర్వహించారు. హరికథ గానంలో హరికథకులు రవిప్రసాదరాజు, గాత్రం శ్రీహరి, తబల విద్వాన్ వై.రమణ, కీ బోర్డు బాలస్వామి పాల్గొన్నారు.
అమ్మవారి రథోత్సవంలో ఎంపీ డీకే అరుణ, ఈఓ దీప్తి
అలంపూర్‌లో త్రిశతి కుంకుమార్చనల్లో భక్తులు
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: డీకే అరుణ
శ్రీజోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రలందరిపై ఉండాలని మహబుబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. అలంపూర్ క్షేత్ర ఆలయాలను డీకే అరుణ సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ దీప్తి అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు వారికి తీర్థప్రసాదాలను అందజేసీ ఆశీర్వచనం పలికారు. అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. జోగుళాంబ అమ్మవారి అశీస్సులు రాష్ట్ర, దేశ ప్రజలందరిపై ఉండాలన్నారు. క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధియే లక్ష్యంగా అమ్మవారికిని వేడుకున్నట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంలో రైతులు అందరు బయటపడాలని అమ్మవారికి కోరుకున్నట్లు తెలిపారు.
సినీ హీరో పూజలు
అలంపూర్ క్షేత్ర ఆలయాలను సినీహీరో శ్రీవిష్ణు సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు వారికి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు చిత్రబృందం సభ్యులు తదితరులు ఉన్నారు.
శరన్ననవరాత్రి ఉత్సవాల్లో విశేష పూజలు
2వ రోజు బ్రహ్మచారిణిగా అమ్మవారి దర్శనం
ఆలయంలో సాముహికంగా కుంకుమార్చనలు
కొనసాగింన సాంస్కృతి ప్రదర్శనలు


