రెండు రోజుల్లో పంపులు ఆన్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో పంపులు ఆన్‌ చేయాలి

Oct 13 2026 12:47 AM | Updated on Oct 13 2026 12:47 AM

కొల్లాపూర్‌ రూరల్‌: పాలమూరు రైతులకు సాగునీరు అందించే ఉద్దేశం లేకనే కాంగ్రెస్‌ ప్రభుత్వం పంపులను నడపడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రెండు రోజుల్లో పంపులను ఆన్‌ చేసి రైతులకు నీళ్లివ్వకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు శివారులోని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్ట్‌, కేఎల్‌ఐ డెలివరీ పంపులను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పంపును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించి, అప్పట్లోనే నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి సుమారు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసిందన్నారు. ప్రస్తుతం రెండు పంపులు అందుబాటులో ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని నడపడం లేదని ఆరోపించారు. శ్రీశైలంలో నీరు, నార్లాపూర్‌లో సిద్ధంగా ఉన్న రిజర్వాయర్‌, పంపులు ఉన్నప్పటికీ సాగునీరు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు.

కరెంట్‌ బిల్లుల భారం వల్లేనా?

విద్యుత్‌ బిల్లుల భారం భరించలేక రైతులకు నీళ్లివ్వడం లేదని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. పంపుల నిర్వహణకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేయాలని, కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌లోని మూడు పంపులను నిరంతరాయంగా నడపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు లేకపోవడంతోనే పంపులు నడపడం లేదని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకుని పంపులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

లేదంటే రైతులతో కలిసి ఉద్యమం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతుల పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?

నార్లాపూర్‌లో సిద్ధంగా ఉన్న పంపులు ఎందుకు నడపడం లేదు?

కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టులకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement