ఖాకీ టోపీ వెనుక.. తండ్రి త్యాగం! | - | Sakshi
Sakshi News home page

ఖాకీ టోపీ వెనుక.. తండ్రి త్యాగం!

Oct 13 2026 12:47 AM | Updated on Oct 13 2026 12:47 AM

● కొడుకు కలకు తండ్రి కష్టం పునాది.. తన హోదానే తండ్రికి కిరీటంగా పెట్టిన కుమారుడు

నవాబుపేట: కొడుకు సాధించిన విజయాన్ని చూసి తండ్రి కళ్లలో ఆనందబాష్పాలు.. ఆ కన్నీటి వెనుక తన కోసం తండ్రి పడిన కష్టం, చేసిన త్యాగాన్ని గుర్తించిన కుమారుడి హృదయం.. వెరసి అందరి మనసులనూ కదిలించిన అపురూప దృశ్యమిది. డీఎస్పీగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధమైన ఓ యువ అధికారి.. తన తండ్రి తలపై తన ఖాకీ టోపీని పెట్టి, తన విజయాన్ని ఆయనకు అంకితం చేశాడు. ‘నాన్నా.. ఈ హోదా నాది కావచ్చు.. కానీ దీని వెనుక ఉన్న కష్టం నీది. నా కోసం నువ్వు చేసిన త్యాగాలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. ఈ కిరీటానికి అసలైన అర్హుడివి నువ్వే’ అన్నట్టుగా తండ్రి తలపై టోపీని ఉంచి తన కృతజ్ఞతను చాటుకున్నాడు. కొడుకు సాధించిన విజయాన్ని చూసి ఆనందంతో భావోద్వేగానికి గురైన తండ్రిని హత్తుకున్న ఆ క్షణం.. అక్కడున్న వారందరినీ కదిలించింది. నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలోని సత్రోనిపల్లితండాకు చెందిన చెందర్‌నాయక్‌ కుమారుడు అరుణ్‌కుమార్‌ సోమవారం డీఎస్పీ శిక్షణను పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తన విజయానికి కారకుడైన తండ్రికి అరుణ్‌కుమార్‌ ఇచ్చిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను చూసి గర్వపడతారు. కానీ, తన విజయానికి వెనుక ఉన్న తండ్రి శ్రమను గుర్తించి, ఆ విజయాన్ని ఆయనకే అంకితం చేయడం అరుణ్‌కుమార్‌ గొప్ప మనసుకు నిదర్శనంగా నిలిచింది. కొడుకు తలపై మెరవాల్సిన ఖాకీ టోపీ.. క్షణకాలం తండ్రి తలపై కిరీటమైంది. ఆ టోపీ కేవలం ఓ హోదాకు గుర్తు కాదు.. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి చేసిన త్యాగాలకు దక్కిన గౌరవం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement