దామరగిద్ద: మండల కేంద్రానికి చెందిన యువకుడు టిప్పర్ ఢీకొని మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కన్కప్ప(25) గతేడాది ఉపాధి కోసం షాద్‌నగర్‌కు వలస వెళ్లాడు. అక్కడే కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య గాయత్రి కన్నీటిపర్యంతం అయ్యింది.
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
ఉప్పునుంతల: బైక్ అదుపుతప్పి ఒకరి మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి మండల కేంద్రానికి సమీపంలో కాంసానిపల్లి వైపు వెళ్లే రోడ్డు మార్గంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని తిర్మలాపూర్‌కు చెందిన తిప్పర్తి నర్సింహరెడ్డి(50) బైక్‌పై పని నిమిత్తం అచ్చంపేట వెళ్లి గ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఉప్పునుంతల దాటిన తర్వాత కిలోమీటర్ దూరంలో ఉన్న కల్వర్టు వద్ద గేదెలు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం అయ్యింది. చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య కావ్యతోపాటు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
గెట్టు పంచాయితీ.. ప్రాణం మీదకు!
● పెద్దల సమక్షంలోనే పురుగుల మందు తాగిన రైతు
● కర్నూలుకు తరలిస్తుండగా మృతి
గట్టు: అన్నదమ్ముల మధ్య పొలం గెట్ల వివాదం ఓ రైతు మృతికి దారితీసింది. పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతుండగా తిమ్మప్ప (38) అనే రైతు పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన గుండన్న కుమారులు పెద్ద నర్సింహులు, చిన్న నర్సింహులు, తిమ్మప్ప, ఆంజనేయులుకు అయిజ మండలం దేవబండ శివారులోని సర్వే నంబర్ 108లో 8–10 ఎకరాల పొలం ఉంది. ఏడాది క్రితం నలుగురు అన్నదమ్ములు పొలాన్ని భాగాలుగా పంచుకుని, హద్దులు ఏర్పాటు చేసుకుని ఒప్పందం రాసుకున్నారు. అయినప్పటికీ గెట్ల విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం మరోసారి వివాదం తలెత్తడంతో తప్పెట్లమొర్సు గ్రామ పెద్దలు దేవబండ సమీపంలోని పొలం వద్ద పంచాయతీ నిర్వహించారు. వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తిమ్మప్ప పొలంలోని గుడిసెలో ఉన్న పురుగు మందు తాగినట్లు గ్రామస్తులు తెలిపారు. గమనించిన పెద్దలు వెంటనే అతడిని అయిజ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అయిజ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కర్నూలు నుంచి గద్వాల ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. తక్షణ సాయంగా రూ.10 వేలు అందజేసి, కుటుంబాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


