మహబూబ్‌నగర్‌ శుభారంభం | - | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌ శుభారంభం

Oct 13 2026 12:47 AM | Updated on Oct 13 2026 12:47 AM

అలంపూర్‌: మాంటిస్సోరి పాఠశాల వేదికగా ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 బాలుర రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజే మహబూబ్‌నగర్‌ జట్లు రెండు విజయాలతో శుభారంభం చేసింది. అంతకుముందు అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి ఎంపికై న క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇలాంటి టోర్నీలు యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు, ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రాణించేలా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జయరాముడు, వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌, మాంటిస్సోరి పాఠశాల కరస్పాండెంట్‌ కేఎన్‌వీ రవిప్రకాష్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు తోట శ్రీనివాసులు, కుమార్‌, టోర్నమెంట్‌ కన్వీనర్‌ ఆనంద్‌, అబ్జర్వర్‌ డాక్టర్‌ స్వామికుమార్‌, ఎంఈఓ అశోక్‌కుమార్‌, జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు త్యాగరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తొలిరోజు ఫలితాలు ఇలా..

తొలి రోజు జరిగిన రెండు మ్యాచుల్లోనూ మహబూబ్‌నగర్‌ విజయం సాధించింది. మెదక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4–0 గోల్స్‌ తేడాతో, కరీంనగర్‌తో జరిగిన మ్యాచ్‌లో 5–0 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. మిగిలిన మ్యాచుల్లో రంగారెడ్డి 9–1 గోల్స్‌తేడాతో ఖమ్మంపై, నిజామాబాద్‌ 9–0 తేడాతో వరంగల్‌పై, నల్లగొండ 4–0తేడాతో హైదరాబాద్‌పై కరీంనగర్‌ 7–0 తేడాతో ఖమ్మంపై, ఆదిలాబాద్‌ 6–0 తేడాతో వరంగల్‌పై, రంగారెడ్డి 2–0 తేడాతో మెదక్‌పై, నిజామాబాద్‌ 4–0 తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించాయి.

రాష్ట్రస్థాయి బాలుర హాకీ

అండర్‌–17 టోర్నీ ప్రారంభం

క్రీడా జ్యోతి వెలిగించిన ఎమ్మెల్యే విజయుడు

పాల్గొన్న 10 ఉమ్మడి జిల్లాల జట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement