మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: వందేమాతరం ఫౌండేషన్, మహబూబ్‌నగర్ ఫస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని మాడల్ బేసిక్ ఉన్నత పాఠశాల, మాడ్రన్ హైస్కూల్‌లో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ స్క్రీనింగ్ పరీక్షకు 900 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆయా కేంద్రాలను ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, వన్‌టౌన్, టూ టౌన్ సీఐలు అప్పయ్య, ఎజాజుద్దీన్ పరిశీలించారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన 120 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ స్థాయిలో నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు గుండా మనోహర్, రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 22 నుంచి 31వ తేదీ వరకు జడ్చర్ల మండలం గొల్లపల్లిలోని లలితాంబికా తపోవనంలో పది రోజులపాటు ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దడం, పరీక్షకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించడమే తమ ధ్యేయమన్నారు. స్క్రీనింగ్ పరీక్షలో ప్రతిభ చూపిన మరో 250 మంది విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.


