● ‘సర్’ దరఖాస్తుల స్వీకరణ పూర్తి
● ఉమ్మడి జిల్లాలో కొత్త ఓటర్ల
నమోదుకు 19,307 దరఖాస్తులు
● పరిశీలనలో అధికార యంత్రాంగం
అచ్చంపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. జూన్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 ద్వారా 19,307 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 1,874 మందిని అర్హులుగా గుర్తించారు. ప్రవాస భారతీయ ఓటర్ల నమోదుకు ఫారం–6ఏ ద్వారా 33 దరఖాస్తులు రాగా, మూడింటిని ఆమోదించారు. ముసాయిదా జాబితా నుంచి ఓటర్ల తొలగింపునకు ఫారం–7 ద్వారా 1,478 దరఖాస్తులు అందగా, 656 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. ఓటర్ల పేర్లు, వివరాలు, చిరునామాల్లో మార్పులు, తప్పుల సవరణకు ఫారం–8 ద్వారా 29,048 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 12,147 దరఖాస్తులను పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తులను నవంబర్ 5లోగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు పరిశీలనను వేగవంతం చేశారు.
13 నియోజకవర్గాల్లో..
ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ప్రవాస భారతీయ ఓటర్ల నమోదుకు పెద్దగా స్పందన కనిపించలేదు. ఫారం–8 ద్వారా పాలమూరులో 5,428 దరఖాస్తులు రాగా, 1,869 పరిష్కరించారు. అచ్చంపేటలో 3,050, కొడంగల్‌లో 2,776, దేవరకద్రలో 2,439, నారాయణపేటలో 2,080 దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించి తుది జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు.


