మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర శివారులోని రాంరెడ్డిగూడెం సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ బ్రేకర్ల మార్పిడి పనులు జరుగుతున్నందున ఈనెల 12న నగరంతో పాటు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలోని 258 గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ధర్మాపూర్ సమీపంలో మెయిన్ పైపులైన్‌కు మరమ్మతు చేపడుతున్నందున రాంరెడ్డిగూడెంలోని నీటిశుద్ధి కేంద్రం నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోనుందన్నారు. తిరిగి ఈనెల 13 నుంచి యథావిధిగా తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని, దీనికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
17న మహాధర్నా
జడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పాలమూరుకు దక్కాల్సిన నీటిని నల్లగొండ జిల్లాకు తరలించే ప్రయత్నాలను ఆపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సాగునీటి వనరుల కల్పనలో విఫలమయ్యాయని, శాశ్వత ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల నుంచి రైతులు, నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
ఎల్‌నినో ప్రభావంపై
నేడు రైతులకు అవగాహన
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఎల్‌నినో ప్రభావంతో మారే వాతావరణ పరిస్థితులు, వ్యవసాయంపై వాటి ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లాలోని 35 రైతు వేదికల్లో సీఎం రేవంత్‌రెడ్డి రైతులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడనున్నారు. పంటల యాజమాన్య పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సీఎం సూచనలు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ తెలిపారు. కలెక్టర్ ఖుష్బూగుప్తా మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ రైతు వేదిక నుంచి పాల్గొననుండగా, రైతులు తమ సమీప రైతు వేదికలకు చేరుకుని కార్యక్రమాన్ని వీక్షించాలని ఆయన సూచించారు.


