నవదుర్గ అలంకరణల్లో జోగుళాంబ | - | Sakshi
Sakshi News home page

నవదుర్గ అలంకరణల్లో జోగుళాంబ

Oct 11 2026 1:33 AM | Updated on Oct 11 2026 1:33 AM

అలంపూర్‌: శక్తి స్వరూపిణి శ్రీ జోగుళాంబ అమ్మవారి కొలువుతో దక్షిణ కాశీ అలంపూర్‌ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయం ముస్తాబైంది. విద్యుద్దీపాల కాంతులు.. ప్రత్యేక అలంకరణలు.. అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులతో క్షేత్రంలో పండుగ సందడి నెలకొంది. నేటి నుంచి పది రోజులపాటు శ్రీ జోగుళాంబ అమ్మవారి, శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాల్లో నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజులపాటు నవదుర్గ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనుండగా.. విజయదశమి వేడుకలు, తుంగభద్ర నదిలో తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

తొలిరోజు ప్రత్యేక పూజలు

ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి స్వామివారి అనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్‌ వరణం, మహాకలశ స్థాపన, అగ్నిముఖం తదితర క్రతువులు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు అంకురారోపణ, ధ్వజారోహణం వంటి విశేష పూజలు జరగనున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ సహస్రనామార్చన, నవావరణ అర్చనలు, చండీహోమాలు, ఇతర హోమాలు, అమ్మవారి దర్బారు సేవ నిర్వహించనున్నారు.

కల్యాణోత్సవం.. రథోత్సవం

నవరాత్రుల్లో పలు విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 16న మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్రీ జోగుళాంబ అమ్మవారి, శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారికి సింహవాహన సేవ ఉంటుంది. ఈ నెల 18న దుర్గాష్టమి సందర్భంగా ఉదయం 10 గంటలకు అమ్మవారి రథోత్సవం జరగనుంది. 19న మహార్ణవమి సందర్భంగా రాత్రి కాళరాత్రి పూజలు నిర్వహించనున్నారు.

విజయదశమి వేళ నదీహారతి

ఈ నెల 20న విజయదశమి సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి మహాపూర్ణాహుతి, అవభృథ స్నపనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు శమీపూజ, 6.30 గంటలకు తుంగభద్ర నదికి హారతి, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. అమ్మవారి, బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను హంస వాహనంపై కొలువుదీర్చి తుంగభద్ర నదిలో విహరింపజేయనున్నారు. ఈ వేడుకలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

నవదుర్గ రూపాల్లో దర్శనం

నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శైలపుత్రి దేవిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండగా, ఐదో రోజు స్కందమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజు మహాగౌరిగా, తొమ్మిదో రోజు సిద్ధిధాత్రిగా అలంకరించనున్నారు. సాయంత్రం దర్బారు సేవలో నవదుర్గల అలంకరణతో పాటు కుమారి, సువాసిని పూజలు, మహా మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహిస్తారు.

శరన్నవరాత్రులకు ముస్తాబైన అలంపూర్‌ క్షేత్రం

పది రోజులపాటు జోగుళాంబ అమ్మవారి ఉత్సవాలు

నవదుర్గ అలంకరణల్లో అమ్మవారి దర్శనం

కల్యాణోత్సవం.. రథోత్సవం.. తెప్పోత్సవం ప్రత్యేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement