చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా పేరొందిన అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయానికి అమావాస్యను పురస్కరించుకుని శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే కోనేరులో స్నానాలు ఆచరించి, మెట్లపై గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి దర్శనం చేసుకున్నారు. భక్తులు దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వ్రతాలు నిర్వహించారు. కొండపై ఉన్న అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపం, స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. రాజగోపురం వద్ద దీపాలు వెలిగించడంతో కొండపై, జాతర మైదానంలో సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ మధనేశ్వరరెడ్డి, కమిటీ చైర్మన్ భత్తుల బాలరాజు, సభ్యులు మైపాల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, అర్జున్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి కుటుంబ సమేతంగా కురుమూర్తిస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. తన కుమార్తె లక్ష్మి సహస్ర జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నదానం చేశారు.


