బతుకుబండిపై మృత్యు పంజా! | - | Sakshi
Sakshi News home page

బతుకుబండిపై మృత్యు పంజా!

Oct 11 2026 1:33 AM | Updated on Oct 11 2026 1:33 AM

గట్టు: బతుకుదెరువు కోసం ఊరిని విడిచి వలస వెళ్లిన కూలీలను రోడ్డు ప్రమాదం కబళించింది. కర్ణాటకలోని యాదగిరి సమీపంలో శనివారం ఉదయం వలస కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను టిప్పర్‌ ఢీకొట్టడంతో ఇందువాసి గ్రామానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. కుటుంబాలకు అండగా నిలవాల్సిన ఇద్దరు వ్యక్తులు దూర ప్రాంతంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన సుమారు 25 కుటుంబాల వారు వారం రోజుల క్రితం పత్తి ఏరేందుకు కర్ణాటకలోని యాదగిరి ప్రాంతానికి వలస వెళ్లారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున బెందిగొమ్మల సమీపం నుంచి సుమారు 35 మంది కూలీలు ట్రాక్టర్‌లో పొలానికి బయలుదేరారు. కొత్తగా నిర్మించిన భారత్‌మాల ఆరు వరుసల జాతీయ రహదారిపై వెళ్తుండగా టిప్పర్‌ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ ఇంజన్‌, ట్రాలీ వేరుపడి కూలీలు రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో ఏసేపు (48) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన నాగన్న (40) రాయచూర్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏసేపు భార్య రూతమ్మ, నాగన్న భార్య సుశీలమ్మ తీవ్రంగా గాయపడగా, మరికొందరు స్వల్ప గాయాలపాలయ్యారు. ఏసేపునకు నలుగురు, నాగన్నకు ఐదుగురు సంతానం ఉన్నారు. కుటుంబాలకు ఆధారంగా ఉన్న ఇద్దరు కూలీల మరణంతో చిన్నారులు తండ్రి ప్రేమకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ ఇదే..

బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే

ప్రమాద సమాచారం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అక్కడి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతునాయుడు, మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇందువాసి సర్పంచి ఈడిగ లక్ష్మి కుమారుడు సుధీర్‌గౌడు ప్రమాద స్థలానికి చేరుకుని కూలీలను పరామర్శించడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులతో సొంతూరిలో ఉపాధి లేక పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిన కుటుంబాలను ఈ ప్రమాదం తీరని శోకంలో ముంచింది. బతుకుదెరువు కోసం వెళ్లిన వారిలో ఇద్దరు తిరిగిరాని లోకాలకు చేరడంతో ఇందువాసిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కర్ణాటకలో టిప్పర్‌ ఢీకొని ఇద్దరు వలస కూలీలు మృతి

పొట్ట చేతపట్టుకుని వలస.. తిరిగిరాని లోకాలకు

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన టిప్పర్‌.. పలువురికి గాయాలు

ఇందువాసిలో విషాదఛాయలు..బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement