నవాబుపేట: పచ్చని చెట్లు.. దట్టమైన అడవి.. పక్షుల కిలకిలరావాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. కోరిన కోర్కెలు తీర్చే వనదేవత మైసమ్మ కొలువైన పర్వతాపూర్ అటవీ ప్రాంతం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవి నవరాత్రి ఉత్సవాలతో అడవంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగనుంది. మండల పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దసరా సెలవులు కూడా రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రకృతి ఒడిలో కొలువైన ఆలయ పరిసరాల్లో సేదతీరుతూ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈఓ మధుసూదనాచారి తెలిపారు.
ఉత్సవాల షెడ్యూల్ ఇలా..
అక్టోబర్ 11న (ఆదివారం) కలశ స్థాపన, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 12న ప్రత్యేక అలంకరణ, 13న విశేష పూజలు, 14న ప్రత్యేక అలంకరణ, 15న అభిషేకాలు, 16న దేవి అర్చన, 17న సరస్వతీ పూజ, దుర్గాహోమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. 18న ఆయుధ పూజ, 19న మహార్ణవమి సందర్భంగా ప్రత్యేక దేవి పూజలు, 20న శమీపూజ, దసరా ఉత్సవాలు నిర్వహించి మంగళహారతితో కార్యక్రమాలను ముగించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
పర్వతాపూర్ మైసమ్మ ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రులు
దేవి నామస్మరణతో మార్మోగనున్న
అటవీ ప్రాంతం
నేటి నుంచి 20 వరకు ఉత్సవాలు


