పండగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

పండగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

Oct 11 2026 1:33 AM | Updated on Oct 11 2026 1:33 AM

● హైవేపై ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొన్న సిమెంట్‌ ట్యాంకర్‌..

● కొడుకును కోల్పోయిన తండ్రి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి

● దసరా సెలవులకు ఇంటికొచ్చిన బాలుడు.. అంతలోనే అనంతలోకాలకు

ఎర్రవల్లి: పండగ పూట ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరియాల్సింది..కుటుంబమంతా కలిసి సంతోషంగా గడపాల్సిన వేళ ఆ ఇంటిని తీరని విషాదం చుట్టుముట్టింది. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆ బాలుడు.. తండ్రితో కలిసి వెళ్లి తిరిగి వస్తాడనుకున్న తరుణంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. హైవేపై జరిగిన ఘోర ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తండ్రి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.

వెనుక నుంచి ఢీకొన్న ట్యాంకర్‌..

స్థానికుల కథనం ప్రకారం.. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లికి చెందిన బోయ శ్రీనివాసులు తన కుమారుడు పరుశరాముడు (13)తో కలిసి ట్రాక్టర్‌పై పొలం నుంచి బెండకాయల బస్తాలను తీసుకెళ్లారు. వాటిని ఇటిక్యాల స్టేజీ వద్ద మరో వాహనంలో హైదరాబాద్‌కు తరలించేందుకు లోడ్‌ చేసి, తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో కర్నూలు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న సిమెంట్‌ ట్యాంకర్‌ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ పల్టీలు కొట్టడంతో పరుశరాముడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసులు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

కిలోమీటరు మేర అదుపుతప్పి..

ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్‌ అదుపు తప్పి సుమారు కిలోమీటరు మేర ముందుకు దూసుకెళ్లింది. డ్రైవర్‌ లేకుండానే హైవేపై తిరుగుతూ ఎదురుగా వచ్చే వాహనాల వైపు దూసుకెళ్లడంతో పాటు, పార్కింగ్‌లో ఉన్న పలు వాహనాలను ఢీకొట్టింది. చివరకు హైవే బస్టాప్‌ను ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో హైవేపై ఇతర వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో మరో భారీ ప్రమాదం తప్పింది.

దసరా సెలవులకు వచ్చి..

అంతలోనే అనంతలోకాలకు

పరుశరాముడు మరికల్‌ మోడల్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల కోసం శుక్రవారమే గ్రామానికి చేరుకున్నాడు. సెలవుల్లో కుటుంబంతో సరదాగా గడపాల్సిన బాలుడు, మరుసటి రోజుల్లో బడికి వెళ్లి చదువుకోవాల్సిన వయసులోనే రోడ్డు ప్రమాదానికి బలయ్యాడు. కళ్లముందే కుమారుడు మృత్యువాత పడటం, తండ్రి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆ కుటుంబం తీవ్ర వేదనలో మునిగిపోయింది. బిడ్డ భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని లోటును మిగిల్చింది. పండగ సంబరాలతో కళకళలాడాల్సిన జింకలపల్లి గ్రామంలో బాలుడి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement