● క్లినిక్ ఎదుట మృతురాలి
కుటుంబ సభ్యుల ఆందోళన
కొత్తపల్లి: ఆర్‌ఎంపీ చేసిన ఇంజక్షన్ వికటించి ఓ మహిళ మృతిచెందిన ఘటన మద్దూరు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామానికి చెందిన మొగులప్ప భార్య ఇటికెల సాయమ్మ (43)కు ఆరోగ్యం బాగాలేదని మద్దూరులోని ఆర్‌ఎంపీ తాజొద్దీన్ వద్దకు వచ్చారు. ఆమెను పరీక్షించిన ఆర్‌ఎంపీ.. ఇంజక్షన్ చేయడంతో ఆమె అక్కడే అపస్మారక స్థితి చేరుకుంది. గమనించిన ఆర్‌ఎంపీ తన కారులోనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, ఆర్‌ఎంపీ చేసిన ఇంజక్షన్ వికటించడంతోనే సాయమ్మ మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు సదరు క్లినిక్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లినిక్ వద్దకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయంపై కోస్గి సీఐ సైదులును వివరణ కోరగా.. తమకు ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదుచేస్తే, పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు.


