● నల్లమల ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృత్యువాత
● గద్వాల జిల్లా తాటికుంట,
ఎక్లాస్‌పురంలో విషాదఛాయలు
ఆత్మకూరు రూరల్/మల్దకల్/అయిజ: ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని బైర్లూటి సమీపంలో నల్లమల ఘాట్ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. కర్నూలు మార్కెట్‌కు టమాట దిగుబడులను తెచ్చిన కొందరు రైతులు గుంటూరులో మంచి ధరలు లభిస్తాయని తెలుసుకొని రెండు బొలేరో పికప్ వ్యాన్‌లను మాట్లాడుకుని లోడ్‌తో వెళ్లారు. అక్కడ సరుకు అమ్ముకుని తిరుగు ప్రయాణమయ్యారు. నల్లమల ఘాట్ రోడ్డు (340సి) సింగిల్ రోడ్డు వెంట భారీ వృక్షాలు, కొండ ప్రాంతం, మలుపులతో ఈ మార్గంలో ప్రయాణం మృత్యువుతో చెలగాటంగా ఉంటుంది. వేగంగా వస్తున్న వాహనాలు ఒకదాన్ని మరొకటి ఓవర్‌టేక్ చేసే సమయంలో ఎదురుగా వచ్చిన రాయచూరు నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బొలేరో నడుపుతున్న నితిన్ (22), పక్కనే కూర్చున్న దేవేంద్రగౌడ్ (25) అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు కిశోర్‌కు కాళ్లు విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆత్మకూరు సీఐ మహేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చేశారు. ప్రమాద దాటికి వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చింది. తీవ్రంగా గాయపడిన కిశోర్‌కు ఆత్మకూరు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. మృతదేహాలకు మంగళవారం ఆత్మకూరులో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. డ్రైవర్ నితిన్ జోగుళాంబ జిల్లా మల్దకల్ మండలం తాటికుంట వ్యక్తి కాగా, దేవేంద్ర గౌడ్, కిశోర్ కర్నూలు జిల్లా ఆర్‌కే దుజ్జాలకు చెందినవారు. అయితే దేవేంద్రగౌడ్ కొన్నేళ్లుగా అయిజ మండలం ఎక్లాస్‌పురంలో నివాసం ఉంటూ.. దగ్గరలో ఉన్న కర్నూలు నగరానికి వెళ్లి బైక్ మెకానిక్‌గా పనిచేసి, వస్తున్నాడు.మంగళవారం సాయంత్రం కర్నూలు జిల్లాలోని దుజ్జాలలో దేవేందర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో తాటికుంట, ఎక్లాస్‌పురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
దేవేందర్‌గౌడ్ ( ఫైల్ )
నితిన్ (ఫైల్)


