● ఓబీసీలకు ప్రత్యేక కాలం, కులాల వారీగా యూనిక్ కోడింగ్ కేటాయించాలి
● చట్టసభల్లో 50శాతం
రిజర్వేషన్ల కోసం పోరాటం
● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
అలంపూర్ రూరల్: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు జాతీయ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం, కులాల వారీగా యూనిక్ కోడింగ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం అలంపూర్ క్షేత్రాన్ని ఆయన సందర్శించి.. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు మహాలయ పితృపక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి, శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం తెలంగాణ అతిథిగృహంలో ఎంపీ కృష్ణయ్య విలేకర్లతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లయినా బీసీలకు ఏ రంగంలోనూ సముచిత వాటా దక్కలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ జనగణన మరింత శాసీ్త్రయంగా నిర్వహించాలని కోరారు. గణన ఫారంలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలం చేర్చడంతో పాటు ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించాలన్నారు. తద్వారా ఏ కులం ఎంత ఆభివృద్ధి చెందిందో, ఏ కులానికి ప్రాతినిధ్యం లేదో స్పష్టమైన లెక్కలు బయటకు వస్తాయన్నారు.
ఫీజు బకాయిలు విడుదల చేయాలి..
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దాదాపు రూ. 8,500 కోట్లు పెండింగ్‌లో ఉండటం విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. కోర్సులు పూర్తయినా సర్టిఫికెట్లు అందక, తదుపరి సంవత్సరానికి ప్రవేశం పొందలేక 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల కోసం 100 గురుకులాలు, 100 కళాశాల హాస్టళ్లను ఏర్పాటు చేయాలన్నారు. కీలక పోస్టుల్లో బీసీ అధికారులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ఉన్న కేసును త్వరగా పరిష్కరించాలని.. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన కోరారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతామన్నారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జోషి రాఘవ, జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్, రాజేంద్ర, శివ, బలరాం ఉన్నారు.


