కల్వకుర్తి టౌన్: విద్యుదాఘాతంతో మృతిచెందిన ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లికి చెందిన శ్యామ్(39) కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో మృతదేహంతోపాటు, అతని నలుగురు కుమార్తెలు, భార్య నిరసనలో పాల్గొన్నారు. మృతుడి కుటుంబం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుందని, అతని కుటుంబానికి రాచాలపల్లికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి గ్రామం నుంచి పెద్దఎత్తున వచ్చిన బంధువులు, కులసంఘాలు, రాజకీయ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు నిరసన విరమించేదిలేదని బైఠాయించారు. నిరసన విరమించాలని పోలీసులు నచ్చచెప్పినా వినిపించుకోలేదు. అవతలి వ్యక్తులకు సాయం చేసేలా పోలీసుల తీరు ఉందని బాధిత బంధువులు ఆరోపించారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి బాధిత బంధువులతో మాట్లాడి నిరసన విరమింప చేసేందుకు ప్రయత్నం చేసినా.. శ్రీనివాస్‌రెడ్డి నిరసన స్థలానికి రావాలని పట్టుబట్టారు. రైతు శ్రీనివాస్‌రెడ్డి సైతం నిన్న రాత్రి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నాడు. చివరకు గ్రామపెద్దలు చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌రెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడి మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా మాట్లాడారు. నిరసనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కల్వకుర్తి డీఎస్పీ ఆధ్వర్యంలో డివిజన్ పోలీసులతోపాటు, స్పెషల్ ఫోర్స్ పోలీసులు భద్రతలో పాల్గొన్నారు. కల్వకుర్తి, వెల్దండ సీఐలు భీమ్‌కుమార్, రఘువీర్‌రెడ్డితోపాటు ఎస్‌ఐలు కురుమూర్తి, యుగంధర్‌రెడ్డి, వీరబాబు, మాధవరెడ్డి, సద్దాం భద్రతను కల్పించారు.


