బల్మూర్: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని గోదల్ గ్రామ శివారులోని పెద్దగుట్ట అక్రమ మైనింగ్‌కు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 121/72 సర్వే నంబర్ల పరిధిలోని గుట్టపై వారం రోజులుగా బ్లాస్టింగ్ నిర్వహించి రాళ్లను వెలికితీస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బ్లాస్టింగ్ అనంతరం రాళ్లను పగులగొట్టి గుట్టపైనే రెండు చోట్ల పెద్దఎత్తున డంప్ చేసినట్లు తెలుస్తోంది. తరచూ పెద్ద శబ్దాలతో బ్లాస్టింగ్ జరుగుతున్నా అధికారులు వెంటనే స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బ్లాస్టింగ్‌కు అనుమతులున్నాయా?
బ్లాస్టింగ్ ద్వారా గుట్టను తవ్వి వెలికితీసిన రాళ్లను అక్కడే పగులగొట్టి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే బ్లాస్టింగ్‌కు అవసరమైన అనుమతులు ఉన్నాయా? లేకుండా నిర్వహించారా? అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గుట్టపై లీజ్ ఉన్నప్పటికీ మైనింగ్ కార్యకలాపాలకు ప్రత్యేక అనుమతులు లేకపోతే ఎలా తవ్వకాలు, బ్లాస్టింగ్ జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సమగ్ర విచారణ చేయాలి
పెద్దగుట్టపై జరిగిన బ్లాస్టింగ్, మైనింగ్, రాళ్ల డంపింగ్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, లీజ్‌దారు కవిత కోరుతున్నారు. బ్లాస్టింగ్‌కు అనుమతులు ఉన్నాయా? ఎంత మేరకు మైనింగ్ జరిగింది? ఎక్కడికి రాళ్లను తరలించారు? అనే వివరాలను అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
పంచనామా నివేదిక ఆధారంగా చర్యలు
గోదల్ గుట్టపై బ్లాస్టింగ్‌పై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా పరిశీలన చేపట్టామని మైనింగ్ ఏడీ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పంచనామా నిర్వహించినట్లు చెప్పారు. రెవెన్యూ శాఖ నివేదిక అందిన అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం గుట్టపై ఒకరికి మాత్రమే లీజ్ ఉందని, మైనింగ్ తవ్వకాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
2021లోనూ చర్యలు
ఇదే పెద్దగుట్టపై 2021లోనూ అక్రమ మైనింగ్, బ్లాస్టింగ్ జరిగినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో అక్రమంగా రాళ్లను తరలిస్తున్న లారీలు, యంత్రాలను మైనింగ్ అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకుని రూ.3 లక్షల జరిమానా విధించినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ అదే ప్రాంతంలో మళ్లీ బ్లాస్టింగ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులుగా కార్యకలాపాలు కొనసాగినట్లు చెబుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక కొందరు ప్రజాప్రతినిధుల హస్తం ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక నిర్ధారణ లేదు.
గోదల్ పెద్దగుట్టపై వారం రోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు
రాళ్లను పగులగొట్టి.. రెండు చోట్ల డంపింగ్
అనుమతులు లేకుండానే
బ్లాస్టింగ్ చేసినట్లు ఆరోపణలు
మైనింగ్, రెవెన్యూ, పోలీసుల సంయుక్త విచారణ


