వెన్నాచేడ్ పెద్దచెరువు గట్టుపై హత్య
సెప్టెంబర్ 18న ఆనంద్ కొత్తపల్లి గ్రామం వద్ద అమృతమ్మను కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం గండేడ్ మండలంలోని వెన్నాచేడ్ పెద్దచెరువు గట్టు వద్దకు తీసుకెళ్లి చీర కొంగుతో ఆమెను గొంతు బిగించి హత్య చేశాడు. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం వెంట తెచ్చుకున్న డీజిల్ పోసి మృతదేహానికి నిప్పంటించాడు. మృతదేహం పూర్తిగా దహనం కాకపోవడంతో సమయం ఎక్కువ పడుతుందని భయపడిన ఆనంద్.. దాన్ని మూటగట్టి కారులో పెట్టుకొని తెలంగాణ సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా శక్తినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తుంగభద్ర నది పరివాహక అటవీ ప్రాంతంలో పడేశాడు. శనివారం కుల్కచర్ల ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు వెన్నాచేడ్ పెద్దచెరువు గట్టును పరిశీలించారు. అనంతరం తుంగభద్రనది పరివాహక ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని కట్టిన మూటను గుర్తించారు. కృష్ణ మండలం, కర్ణాటక పోలీసుల సహకారంతో పంచనామా నిర్వహించి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మూటగట్టిన కాలిన ఎముకలు, బూడిదను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ఆస్పత్రికి తరలించామని కృష్ణ ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
గండేడ్/మాగనూర్: అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలు ఓ మహిళ దారుణహత్యకు దారితీశాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్‌కు చెందిన అమృతమ్మ (34)ను అదే గ్రామానికి చెందిన మంగలి ఆనంద్ హత్య చేసి, మృతదేహాన్ని డీజిల్‌తో దహనం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తిగా దహనం కాకపోవడంతో మృతదేహాన్ని మూటగట్టి కారులో తరలించి తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. శనివారం కుల్కచర్ల పోలీసులు వెన్నాచేడ్ పెద్దచెరువు గట్టుతో పాటు మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. చెల్లాపూర్ గ్రామానికి చెందిన అమృతమ్మ భర్త భీమయ్య రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వెంకటమ్మ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆనంద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి సన్నిహితం వివాహేతర బంధంగా మారింది. సెప్టెంబర్ 18న కుల్కచర్లకు వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇద్దరు పిల్లలను ఆమె వద్దే వదిలి ఇంటి నుంచి వెళ్లిన అమృతమ్మ తిరిగి రాలేదు. పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో సెప్టెంబర్ 29న వెంకటమ్మ కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆభరణాల కోసం పథకం?
కేసు దర్యాప్తులో భాగంగా అమృతమ్మతో సన్నిహితంగా ఉన్న పలువురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో ఆనంద్‌పై అనుమానం రావడంతో ఆయనను అదుపులోకి తీసుకొని విచారించారు. అమృతమ్మ వద్ద ఉన్న సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఆనంద్ తీసుకుని తనఖా పెట్టి డబ్బులు వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఆభరణాలను తిరిగి ఇవ్వాలని ఆమె పలుమార్లు కోరడంతో హత్య చేసినట్లు గుర్తించారు.
వెన్నాచేడ్ చెరువు గట్టుపై మహిళ హత్య
డీజిల్ పోసి మృతదేహం దహనానికి యత్నం
సగం కాలిన తర్వాత మూటగట్టి తుంగభద్ర పరివాహక ప్రాంతంలో పడేసిన నిందితుడు
కాలిన ఎముకలు, బూడిదను స్వాధీనం చేసుకున్న పోలీసులు


