జడ్చర్ల: కావేరమ్మపేటలోని ఎంబీ మెడికల్ సెంటర్‌కు సంబంధించిన ఆస్తులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డితో కలిసి శనివారం ఆయన ఎంబీ మెడికల్ సెంటర్ స్థలాన్ని సందర్శించారు. అయితే పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు వద్ద పోలీసులతో ఆయనకు వాగ్వాదం చోటుచేసుకుంది. భూ భారతి రికార్డుల ప్రకారం ఆస్తులు ఎంబీ మెడికల్ సెంటర్ పేరుతో ఉన్నాయని, అలాంటప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులను విచారించి నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉందని ప్రవీణ్‌కుమార్ అన్నారు. పోలీసుల తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఎస్‌ఐ మల్లేష్ స్పందిస్తూ.. హైకోర్టు ఆదేశాల మేరకే భూమిని కొనుగోలు చేసిన వారికి పోలీసు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. భూములను తాము చట్టప్రకారమే బ్యాంకుల వేలంలో కొనుగోలు చేశామని, కోర్టు ఉత్తర్వుల మేరకు ముందుకు సాగుతున్నామని కొనుగోలుదారు సాయిరెడ్డి వివరించారు.
భూ రికార్డుల్లో సంస్థ పేరే ఉంది
పోలీసుల తీరుపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అభ్యంతరం
పభుత్వమే జోక్యం చేసుకోవాలని డిమాండ్
లక్షలాది మందికి వైద్య సేవలు
ఎంబీ మెడికల్ సెంటర్‌లో గతంలో వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మందికి వైద్య సేవలు అందాయని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు డైరెక్టర్ డాక్టర్ ఆర్నాల్డ్ బ్యాంకు రుణాలు తీసుకున్నారని, అనంతరం వివిధ కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ ఆస్తులకు లక్షలాది మంది దళిత, క్రైస్తవుల మనోభావాలతో సంబంధం ఉందని పేర్కొన్నారు. వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే ప్రయత్నం వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలకు, ప్రభుత్వ చర్యలకు పొంతన లేదని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 25 ప్రకారం మతపరమైన స్వేచ్ఛ, హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎంబీ మెడికల్ భూముల పరిరక్షణకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎంబీ మెడికల్ భూముల వ్యవహారాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రణీల్, నందకిషోర్, దేవ, ఇమ్ము తదితరులు పాల్గొన్నారు.


