సృజన హత్యతో ఉలిక్కిపడ్డ అమరచింత | - | Sakshi
Sakshi News home page

సృజన హత్యతో ఉలిక్కిపడ్డ అమరచింత

Oct 4 2026 10:19 AM | Updated on Oct 4 2026 10:19 AM

● బెట్టింగ్‌ ఉచ్చులో రవికుమార్‌

● డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి

● హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివి.. ఉద్యోగం చేయకుండా జులాయి తిరుగుళ్లు

అమరచింత: మెడికో విద్యార్థిని సృజన హత్యతో అమరచింత ఒక్కసారిగా వార్తల్లోకి రావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. సృజనను హత్య చేసిన రవికుమార్‌ తమ పట్టణానికి చెందిన రంగస్వామి కుమారుడని తెలియడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చైన్నెలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసిన రవికుమార్‌ ఉద్యోగంలో స్థిరపడకుండా స్నేహితులతో కలిసి తిరగడం, మద్యం సేవించడం, బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం తరచూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌లో మెడిసిన్‌ చదువుతున్న సృజనతో ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటామని తండ్రికి చెప్పడంతో వారు అంగీకరించారు. అయితే పెళ్లి కోసం డబ్బులు కావాలంటూ రవికుమార్‌ ఒత్తిడి చేసేవాడు. కాగా.. ఆగస్టు 16న తన చెల్లికి చెందిన నాలుగున్నర తులాల బంగారాన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఆత్మకూర్‌లోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి సుమారు రూ.4.5 లక్షలు తీసుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లాడని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు.

బెట్టింగ్‌.. మద్యానికి బానిస

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్‌ యాప్‌లకు అలవాటుపడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు ఒక్కోసారి రూ.10–15 వేలు ఖర్చు చేసేవాడని, అప్పులు చేయడం.. వాటిని తీర్చలేకపోవడంతో ఇప్పటివరకు దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు తల్లిదండ్రులే తీర్చారని చెప్పారు.

ఉన్నతంగా చూడాలనుకున్నాం..

తన కుమారుడు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని ఆశించామని రవికుమార్‌ తండ్రి రంగస్వామి తెలిపారు. మద్యం, బెట్టింగ్‌లకు అలవాటుపడి జీవితం నాశనం చేసుకున్నాడని వాపోయాడు. సృజనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అంగీకరించామన్నారు. ఆగస్టు 16న ఇంట్లో బంగారు నగలు ఎందుకు దొంగతనం చేశావని ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా మరుసటి రోజు హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత ఇంటికి రాలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement