కల్వకుర్తి టౌన్: బైకుపై వెళ్తూ అదుపుతప్పి యువకుడు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. పట్టణంలోని బలరాంనగర్‌కు చెందిన రూపేశ్(22) డీజే ఆపరేటింగ్ చేస్తుంటాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరి స్నేహితులతో కలిసి మహబూబ్‌నగర్ రోడ్డులో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నుంచి బయలుదేరి హైదరాబాద్ రోడ్డు వైపు వెళ్తున్నారు. ఎస్‌బీఐ వద్దకు రాగానే బైకు అదుపుతప్పి కిందపడ్డారు. రూపేశ్ దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించారు. ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మేస్త్రి మృతి
కోస్గి రూరల్: చెట్లపొదల్లో మేస్త్రి మృతిచెందిన ఘటన పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల సమీపంలో శనివారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బ్రాహ్మణవీధికి చెందిన దామరగిద్ద నర్సింహులు (50) మేస్త్రి పని చేసుకుంటూ జీవనం గడిపేవాడు. ఐదేళ్ల క్రితం భార్య చనిపోవడంతో తరచుగా మద్యం తాగేవాడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటికి తిరిగి రాలేదు. శనివారం ఉదయం ఉర్దూ మీడియం పాఠశాల సమీపంలోని ముళ్లపొదల్లో చనిపోయి ఉన్నాడు. మృతుడి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బావిలో జారిపడిరైతు మృతి
వనపర్తి రూరల్: వ్యవసాయ బావిలో జారిపడి రైతు మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బూడిదపాడు గ్రామానికి చెందిన మండ్ల వెంకటయ్య (47) శనివారం ఉదయం పొలంలోని వ్యవసాయ బావి వద్ద కరెంటు మోటారును బయటకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయాడు. ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు మరో మోటారు సాయంతో బావిలోని నీటిని తోడించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో రాయిచూర్‌వాసి మృతి
కేటీదొడ్డి: కుక్కను తప్పించబోయి బైక్ అదుపుతప్పి కిందపడి రాయిచూర్ వాసి మృతిచెందిన ఘటన మండలంలోని చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. రాయిచూర్ చెందిన చంద్రశేఖర్ (51) రాయిచూర్‌లోని సురక్ష ఆస్పత్రిలో వార్డుబాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం బైక్‌పై రాయిచూర్ నుంచి గద్వాలకు వస్తుండగా మార్గమధ్యంలో కేటీదొడ్డి తహసీల్దార్ కార్యాలయం రోడ్డు వద్ద కుక్కను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు గద్వాల ఆస్పత్రి, అక్కడి నుంచి రాయిచూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. సాయంత్రం 7:30 గంటలకు మృతిచెందాడు. ఈ ఘటనపై శుక్రవారం మృతుడి భార్య ఉమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


