వుక్తల్: యశోద హత్య కేసు దర్యాప్తులో పసిబిడ్డ విక్రయ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పసిబిడ్డను విక్రయించిన వారు, కొనుగోలు చేసిన వారిని శనివారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌కు రప్పించి విచారించారు. హత్య కేసుతో పాటు శిశువు విక్రయానికి సంబంధించిన అంశాలపై పోలీసులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మరికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో సెప్టెంబర్ 7వ తేదీన యశోద మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రి సిబ్బంది, అంబులెన్స్ సిబ్బందిలో కొందరి ప్రమేయంతో శిశువు విక్రయానికి బేరసారాలు జరిగినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. మొదట మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి బిడ్డను విక్రయించినట్లు సమాచారం. అయితే కొనుగోలుదారుడి కుటుంబంలో అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు పెరగడంతో శిశువును మరో వ్యక్తికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిశువును కొనుగోలు చేసిన వారు తమ వద్ద రాతపూర్వక పత్రాలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. వాటిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. చివరకు శిశువును మక్తల్ పోలీసుల ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం బిడ్డను సురక్షితంగా ఉంచి, సంరక్షణకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. పసిబిడ్డను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బు కోసమే యశోద హత్య జరిగిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసుతో ముడిపడిన వ్యక్తులను, శిశువు విక్రయ వ్యవహారంలో ఉన్న వారిని విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కాగా.. గర్భిణులు ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుండగా.. అక్కడే శిశువుల విక్రయానికి సంబంధించిన వ్యవహారాలు చోటుచేసుకుంటే ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
● అమ్మినోళ్లు.. కొన్నోళ్లను పోలీస్‌స్టేషన్‌కు రప్పించి విచారణ
● బిడ్డ విక్రయం డబ్బుల కోసమే హత్య చేసినట్లు అనుమానాలు


