● మక్కల కొను‘గోల్‌మాల్’పై పోలీసులవిచారణ ముమ్మరం
జడ్చర్ల: బాదేపల్లి సింగిల్‌విండో ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ చేపట్టిన మొక్కజొన్న కొనుగోళ్లలో చోటు చేసుకున్న అక్రమాలపై జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మంగళవారం సింగిల్‌విండో సీసీఓ యాదగిరితో పాటు బాధిత కోడ్గల్ గ్రామ రైతులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన బస్తాలు.. కాంటా చేయడం.. ఆ తర్వాత లారీల్లో గోదాంకు తరలింపు వంటి అంశాలపై సమగ్ర వివరాలు సేకరించారు. కాంటా సమయంలో బస్తాపై అదనంగా ఎంత మేరకు తూకం వేశారనే దానిపై ఆరా తీశారు. గోదాంకు ధాన్యం తరలింపు అనంతరం మార్క్‌ఫెడ్‌కు సమర్పించే ట్రక్ షీట్లలో తేడా వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన బస్తాలనే ఏమార్చి బినామీ రైతుల పేరుపై తక్ పట్టీలు సృష్టించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంతే కాకుండా కొనుగోలు కేంద్రం నుంచి ఏ గోదాంకు ఎంత ధాన్యం తరలించారనే వివరాలను సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి.. అక్రమాలను వెలికితీసే దిశగా విచారణ జరుపుతున్నట్లు సీఐ కమలాకర్ వెల్లడించారు.
కలెక్టర్‌కు నివేదిక..
మొక్కజొన్న రైతులకు మార్క్‌ఫెడ్ చెల్లించిన బిల్లుల్లో కోతలు విధించడంపై కలెక్టర్ ఖుష్బూగుప్తాకు అందిన ఫిర్యాదుల మేరకు విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మార్క్‌ఫెడ్ డీఎంపై సస్పెన్షన్ వేటు వేసి.. జిల్లా ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పూర్తిస్థాయిలో విచారించి.. మూడు రోజుల క్రితమే నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. అధికారులు నివేదిక మేరకు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.


