అనుమానంతో విచారణ..
కల్వకుర్తి టౌన్: వారంతా ఒకే తండ్రి పిల్లలు.. కానీ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఏర్పడిన భూ తగాదా, పాత కక్షలతో ఒకరి ప్రాణం తీశారు. వెల్దండ మండల కేంద్రంలో ఈ నెల 3న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. వెల్దండకు చెందిన రుద్రాక్షల సాయిలుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. మొదటి భార్య జంగమ్మకు రుద్రాక్షల కృష్ణయ్య, రెండవ భార్య అంజనమ్మకు శివశంకర్, మహేశ్, మూడవ భార్య మానుపాటి పెద్ద వెంకటమ్మకు అన్వేష్, శివ, పవన్ సంతానం ఉన్నారు. కల్వకుర్తిలో పెద్ద వెంకటమ్మకు ఉన్న పందుల షెడ్డును పలు కారణాలతో తీసివేయగా.. దాన్ని 2023లో రుద్రాక్షల సాయిలు తన వ్యవసాయ పొలంలో పెట్టించాడు. ఈ విషయంపై రెండవ భార్య పిల్లలైనా మహేశ్, శివశంకర్ అభ్యంతరం తెలిపారు. దీనిపై గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే సాయిలు తన కూతురుకు 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి వెల్దండలో స్లాట్ బుక్ చేయగా.. మహేశ్ అడ్డుకున్నాడు. ఈ విషయంలోనూ మొదటి, రెండో భార్య పిల్లలకు గొడవలు జరిగి.. వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అదే విధంగా కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములుకు చెందిన పందులను మానుపాటి పవన్, శివ, అన్వేష్ చోరీ చేసి వెల్దండలోని షెడ్డు వద్ద ఉంచారని మహేశ్ సమాచారం ఇవ్వడంతో కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో చోరీ కేసు నమోదైంది. ఆ తర్వాత తన పందులను తీసుకెళ్లేందుకు వెల్దండకు వెళ్లిన బెల్లంకొండ రాములును గతేడాది ఆగస్టు నెలలో పవన్, శివ, అన్వేష్ కలిసి హత్యచేశారు. ఈ కేసులో వారంతా జైలుకు వెళ్లగా.. అదే సమయంలో మహేశ్‌ను ఎరుకల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే అతడు ఎదిగితే తమను బతకనివ్వడని భావించిన చిన్నమ్మ పెద్ద వెంకటమ్మ, ఆమె కుమారులు అన్వేష్, శివ, పవన్ తమ సమీప బంధువు కృష్ణయ్యతో కలిసి మహేశ్ హత్యకు పథకం రచించారు.
● నిందితులు జైలుకు వెళ్లి వచ్చాక మహేశ్‌తో స్నేహం ఏర్పరచుకొని అతడి పూర్తి కదలికలను నిశితంగా గమనించారు. ఈ క్రమంలోనే కల్వకుర్తిలోని గాజులవాడకు చెందిన బురాన్ అనే టిప్పర్ డ్రైవర్‌కు రూ. 2లక్షలకు సుఫారీ ఇచ్చారు. రంజాన్ ముందు రోజు రూ.లక్ష, మరో 20 రోజుల తర్వాత రూ. 50వేలను అతడికి అందజేశారు. అనుకున్న పథకం ప్రకారం ఈ నెల 3న వెల్దండ నుంచి వ్యవసాయ పొలానికి కారులో వెళ్తున్న మహేశ్‌ను టిప్పర్‌తో ఢీకొట్టారు. అయినప్పటికీ అతడు చనిపోలేదు. ఈ క్రమంలో టిప్పర్ డ్రైవర్ బురాన్ మహేశ్ కాళ్లు పట్టుకోగా.. అన్వేష్, శివ బండరాయితో తలపై మోది హతమార్చారు.
కుటుంబ సభ్యులే సుఫారీ ఇచ్చి
హతమార్చిన వైనం
హత్య చేసి.. రోడ్డుప్రమాదంగా
చిత్రీకరించే యత్నం
వెల్దండలో యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిందితుల అరెస్టు..
రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన
కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి
వెల్దండ పోలీసులకు రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మొదటగా రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు.. అనుమానంతో లోతుగా విచారణ చేపట్టడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. గతంలో వీరి వ్యవసాయ పొలంలో రాములును హతమార్చిన నిందితులను తమదైన శైలిలో విచారించగా.. వారే హత్య చేశారని ఒప్పుకున్నారు. వెల్దండ సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ కురుమూర్తి నిందితులను కల్వకర్తిలోని పందుల షెడ్డు వద్ద అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు అన్వేష్, శివ, పవన్, వెంకటమ్మ, కృష్ణయ్య, బురాన్ నుంచి ఆరు సెల్‌ఫోన్లు, టిప్పర్, కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించిన వెల్దండ సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, డీఎస్పీ వెంకట్‌రెడ్డి అభినందించారు.


