అమ్రాబాద్: స్థానికంగా ప్రసిద్ధి గాంచిన అమరేశ్వరాలయంలో కిలోన్నర వెండి ఆభరణాలు చోరీకి గురై ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు వివరాలు. ఆలయంలో ప్రతి సోమవారం పూజలు చేసిన అనంతరం రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. ఎప్పటిలాగే సోమవారం అర్ధరాత్రి వరకు గ్రామస్తులు భజన చేసి ఇళ్లకు వెళ్లారు. ముగ్గురు వృద్ధులు అక్కడే నిద్రించారు. వీరు నిద్రలోకి జారుకున్న అనంతరం మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు శివలింగం వెండితొడుగు, అమ్మవారి కిరీటం, అభయ అస్తం కలిపి మొత్తం కిలోన్నర వెండి ఆభరణాలు అపహరించారు.
డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు
విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు గ్రామ పెద్దలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. శివలింగం, అమ్మవారి విగ్రహాల మీద ఉన్న వేలిముద్రల ఆధారంతో కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
యువకుడి బలవన్మరణం
మన్ననూర్: మనస్థాపంతో యువకుడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మ న్ననూర్‌లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థాని కుల వివరాల ప్రకారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని ఉమామహేశ్వర కాలనీకి చెందిన రామావత్ చోక నాయక్ (45) భార్య ఉమతో గొడవపడ్డాడు. దీంతో మనస్థాపానికి గురై కలుపు నివారణ మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. అమ్రాబాద్ పోలీసులు మృతుడి ఇంటి వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. మృతుడికి భార్యతో పాటు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
విద్యుదాఘాతంతో
వలస కూలీ మృతి
మదనాపురం: బతుకు దెరువు కోసం నగరం వెళ్లి న ఆ కూలీని విద్యుత్ షాక్ బలితీసుకుంది. భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉండగా.. 11కేవీ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్‌లో చోటుచే సుకుంది. మదనాపురం మండలం శంకరమ్మపేటకు చెందిన బొగ్గు నాగరాజు (35) కొంతకాలంగా హైదరాబాద్‌లో వలస కూలీగా పనిచేస్తున్నారు. మంగళవారం తుర్కయాంజల్‌లో ఓ ఇంటి పైకప్పు (స్లాబ్) కాంక్రీట్ పనులు చేస్తుండగా, పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలాయి. తీవ్రమైన విద్యుత్ ఘాతానికి గురైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాగరాజు మృతివార్త తెలియగానే స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నా యి. మృతుడికి భార్య నాగలక్ష్మితోపాటు ము గ్గురు కూతుర్లున్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న నాగ రాజు మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యింది. బంధువులు, గ్రామస్తుల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పురుగు మందు తాగి యువకుడు బలవన్మరణం
మానవపాడు: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గోకులపాడులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ స్వాతి వివరాల మేరకు.. గోకులపాడుకు చెందిన నర్సింహులు (28) ఈ నెల 4న కొర్విపాడు గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతిడి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య సరస్వతి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


