గండేడ్: మండలంలో మరోమారు చిరుతలు కలకలం రేగింది. గతంలో ఒక చిరుత మాత్రమే పలుమార్లు దర్శనం ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా మూడు చిరుతలు కంటపడడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏవైపు నుంచి చిరుతలు దాడి చేస్తాయోనని తెలియక ప్రాణాలు అరచేత పట్టుకుని పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. సోమవారం చిరుతలు ఉన్నట్లు స్పంష్టంగా ఫారెస్టు అధికారుల ధ్రువీకరించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. వివరాలిలా.. గండేడ్ మండలంలోని మన్సూర్‌పల్లి సమీపంలో రెడ్డిపల్లి రెడ్డిచెరువుకు చేరువలో బొందెగట్టు వద్ద మూడు చిరుతలు సంచరిస్తున్నాయి. వారం రోజులు తరచుగా చిరుతలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మన్సూర్‌పల్లికి చెందిన రైతు ఏదుల బాలయ్య గమనించి సోమవారం ఉదయం ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారంరోజులుగా చిరుతలు తిరగాడుతున్నాయని ఉదయం బయటికి వచ్చి గుట్టకిందికి వెళ్తాయని చెప్పాడు. అయితే తాము వాటిని చూస్తేగాని ధ్రువీకరించలేమని.. అవి బయటకు వచ్చినప్పుడు సమాచారం ఇవ్వాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ రైతు బాలయ్యకు సూచించాడు. దీంతో సోమవారం సాయంత్రం అవి గుట్టమీద గుండుపై బయట కూర్చోవడంతో వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్, బీట్ ఆఫీసర్ ఉదయేశ్వర్ మన్సూర్‌పల్లి బొందెగట్టుకు చేరుకొని ఏదుల బాలయ్య పొలం వద్ద నిలబడి గుట్టపై తిరుగాడుతున్న చిరుతలను గుర్తించారు. మూడు పెద్ద చిరుతలు ఉన్నట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని రేంజర్ అబ్దుల్‌హైకి తెలుపడంతోపాటు జిల్లా ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. కనిపించిన చిరుతలు పెద్దవేనని వారు పేర్కొన్నారు.
2011లో ఇక్కడే చిక్కిన చిరుత
2011 మే11న మనూర్‌పల్లి ఏదుల బాలయ్య పొలం సమీపంలో చిరుత బోనుకు చిక్కింది. ఇదే రైతు అప్పట్లో చిరుత సంచారాన్ని గుర్తించి అప్పటి రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి బోను ఏర్పాటు చేస్తే వారంలోపే చిరుత బోనుకు చిక్కింది. దానిని తీసుకెళ్లి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్టులో అప్పట్లో వదిలిపెట్టారు. తిరిగి చిరుతలు అదేప్రాంతంలో తిరుగాడుతుండడంతో అదే రైతు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఏదీఏమైనా ఫారెస్టు అధికారులు వీలైనంత త్వరగా చిరుతలు పట్టుకుని తరలించాలని ఆయా గ్రామాల ప్రజలు రైతులు కోరుతున్నారు.
స్థానికుల సమాచారంతోగుర్తించిన ఫారెస్టు అధికారులు
ఉన్నతాధికారులకు సమాచారం,నేడు బోను ఏర్పాటుకు
సన్నాహాలు
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక


