ఈతకు వెళ్లి విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

Mar 24 2026 8:35 AM | Updated on Mar 24 2026 8:35 AM

అయిజ: ఈతకు వెళ్లి ఆరో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆదివారం ఉత్తనూరుకు చెందిన దర్శన్‌(11) గ్రామం పక్కనున్న బావిలో ఈతకొట్టడానికి వెళ్లి కనపడకుండా పోయాడు. రాత్రి వరకు బాలుడు ఇంటికి రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు బావిదగ్గరకు వెళ్లి చూశారు. పోలీసులు, ఎండీఆర్‌ఎఫ్‌ బృందం రాత్రి 12గంటలకు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బావిలో పడి రైతు మృతి

గోపాల్‌పేట: ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతిచెందిన ఘటన మండలంలోని తాడిపర్తిలో సోమవారం వెలుగు చూసింది. గోపాల్‌పేట ఎస్‌ఐ జగన్‌మోహన్‌ కథనం ప్రకారం.. తాడిపర్తికి చెందిన లక్ష్మి, శేషయ్య(50) భార్యాభర్తలు. గ్రామశివారులోని కిషన్‌రావుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం భార్య లక్ష్మి, ఆమె చిన్నకుమారుడు, మరొక యువకుడు కలిసి బావిలో వెతకగా శేషయ్య మృతిచెంది కనిపించాడు. కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతిచెంది ఉంటాడని, శేషయ్య మృతిపై ఎటువంటి అనుమానం లేదని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి దుర్మరణం

మహమ్మదాబాద్‌: మండలంలోని నంచర్ల గేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా.. గాధిర్యాల్‌కు చెందిన ఆముదాల హన్మయ్య(55) వార్డు మెంబరు మేసీ్త్రగా కూలీనాలి చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం ఆయన బైక్‌పై మహమ్మదాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. నంచర్ల గేటు సమీపంలో వెనక అతివేగంగా వస్తున్న యువకుల బైక్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో హన్మయ్య తీవ్రగాయాలతో కిందపడిపోయాడు. కాలువిరగడంతోపాటు తలకు తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే అక్కడున్న వారు 108లో మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. హన్మయ్య మృతితో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి.

శ్రీశైలం రహదారిపై..

వెల్దండ: మండల కేంద్రంలో హైదరాబాద్‌– శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సోమవారం జరిగింది. పూర్తి వివరాలు.. మండలంలోని చెరుకూరు చెందిన దొడ్ల రమేష్‌(36) కల్వకుర్తి మండలం ఎల్లికల్‌ గ్రామంలో సమీప బంధువు అంత్యక్రియలకు బైకుపై వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో వెల్దండ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కిందపడ్డాడు. అనంతరం మరో వాహనం అతనిపై వెళ్లడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య పద్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

గట్టు: పొలంలో చెట్టుకు ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన కుర్వ మల్లేశ్‌ అలియస్‌ ఉలిగెప్ప(21) ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా ఉన్న విషయాన్ని చుట్టు పక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సరోజమ్మ, ఏడాదిన్నర కుమార్తె ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

వివాహిత ఆత్మహత్య

అచ్చంపేట రూరల్‌: కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం పట్టణంలో చోటు చేసుకుంది. రెండో ఎస్‌ఐ ఇందిర తెలిపిన వివరాలు.. గోకుల్‌నగర్‌కు చెందిన శారద(38) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. ఈ క్రమంలో శనివారం తీవ్రంగా నొప్పి రావడంతో భరించలేక పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వెల్దండ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement