● మినీ సరస్ మేళా ప్రారంభించినకలెక్టర్ ఖుష్బూగుప్తా
● శిల్పారామంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌తో పాటు వారికి ప్రోత్సాహం కల్పించడమే సరస్ ఎగ్జిబిషన్ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామాభివృద్ధి సంస్థలు, నాబార్డు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘మినీ సరస్ మేళా‘ను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ నెల 29 వరకు నిర్వహించనున్న మేళాను ప్రజలు పెద్దఎత్తున సందర్శించి, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఎగ్జిబిషన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వయం సహాయక సంఘాల ద్వారా సుమారు 50 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, డీఆర్‌డీఏ, నగరపాలక సంస్థ, ఇతర శాఖల అధికారులను కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎగ్జిబిషన్‌లో స్టాళ్లతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘భరోసా’, వైద్యారోగ్య శాఖ హెల్త్ క్యాంప్, బీసీ సంక్షేమ శాఖ, ఎస్‌బీఐ బ్యాంక్ స్టాళ్లు ఏర్పాటు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, డీఆర్డీవోలు నరసింహులు, మొగులప్ప, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, నాబార్డు ఏజీఎండీఈ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


