తక్కువ ఖర్చుతో ఎన్నికలు చేసేవాళ్లం..
● ప్రస్తుతం డబ్బు లేనిదే రాజకీయం లేదు
● మున్సిపల్ మాజీ చైర్మన్ కొత్వాల్
పాలమూరు: అభ్యుదయ భావాలతో మొదట విద్యార్థి నాయకుడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించానని, దేశానికి కాంగ్రెస్‌తోనే రక్షణ అని విశ్వసించి ఆ పార్టీలో చేరి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగానని చెబుతున్నాడు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్. ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గతంలో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా పనిచేసిన నేపథ్యంలో అప్పటి ఎన్నికల తీరు.. చైర్మన్‌గా తాను చేసిన అభివృద్ధి పనులపై ఆయన మాటాల్లోనే.. 2005 మున్సిపల్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 15వ వార్డు రామయ్యబౌళి నుంచి కౌన్సిలర్‌గా గెలిచి.. మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాను. ఆ సమయంలో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండేవి. అప్పట్లో రాజకీయాలు చాలా గౌరవంగా ఉండేవి. మంచి నాయకులు కావాలని ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి ఎన్నుకునేవారు. నేను చాలా తక్కువ మొత్తం ఖర్చు పెట్టి కౌన్సిలర్ గెలిచాను. ప్రతిదానికి డబ్బు అవసరం లేకుండే.. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఆర్ధికంగా సాధారణ పౌరులు ప్రత్యక్ష ఎన్నికల పోటీలో దిగే పరిస్థితి లేదు.
● నేను చైర్మన్‌గా ఉన్న సమయంలో 2008లో అప్పటి సీఎం, దివంగత నేత వైఎస్సాఆర్ మహబూబ్‌నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం గొప్ప అనుభూతి కలిగించింది. అప్పట్లో పాలమూరు పట్టణంలో తాగునీటి సమస్య అధికంగా ఉండేది. దాదాపు రూ.75 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశా. ఇందిరమ్మ ఇళ్లు, పట్టణంలో చాలా వరకు డ్రెయినేజీలు, డీఎఫ్‌ఐడీ, ఐహెచ్‌డీపీ నిధులతో పట్టణ పేదరిక నిర్మూలన కోసం, మహిళా సంఘం భవనాలు, మెప్మా ఏర్పాటు చేశాం. ప్రధానంగా టీఎఫ్‌ఐ అనే కొత్త పథకానికి ఇక్కడే శ్రీకారం చుట్టగా.. ఈ పథకం విజయవంతం కావడంతో ఏపీలో మోడల్‌గా దీనిని అమలు చేశారు. గతంలో ఏపీలో పలు జిల్లాలకు ఇన్‌చార్జ్‌గా, 12ఏళ్లు డీసీసీ అధ్యక్షుడిగా, పీఏసీఎస్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ పని చేశాను. 1994లో కాంగ్రెస్ నుంచి అమరచింత నియోజకవర్గం నుంచి, 2014లో మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను.


