పైరవీలు లేకుండానేరుగా స్టేషన్లకు వెళ్లండి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదుదారుల లేదా బాధితులు ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీసు అధికారులను సంప్రదించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. బాధి తులు ఇచ్చిన సమస్యలపై పరిశీలించిన ఎస్పీ ఆయా స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి త్వరగా చర్యలు తీసుకొని, కేసులు పరిష్కరించాలని సూచించారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అన్నారు. ఎవరి జోక్యం లేకుండా, భయబ్రాంతులు లేకుండా ప్రజలు తమ సమస్యలను వెల్లడించాలని తెలిపారు.
ప్రజావాణికి 51 వినతులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం మీటింగ్‌హాల్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ వారం వివిధ సమస్యలపై 51 అర్జీలు అందాయి. అనంతరం అధికారులతో మాట్లాడుతూ సీఎం కప్ క్రీడా పోటీలను షెడ్యూల్ ప్రకారం గ్రామ, మండల, మున్సిపాలిటీ, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో నిర్వహించేందుకు ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈనెల 22 వరకు గ్రామస్థాయిలో, తర్వాత 28 నుంచి 31 వరకు మండల, మున్సిపల్ స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు నియోజకవర్గంలో, ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఓ నర్సింహులు, ఆర్‌డీఓ నవీన్, స్పెషల్ డిప్యూట్ కలెక్టర్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
రేషన్‌కార్డుల కేవైసీ త్వరగా పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీని వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసుదన్‌నాయక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్‌లో సివిల్ సప్లయ్ అఽధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో ఇప్పటి వరకు 67శాతం ఈ కేవైసీ పూర్తి చేసినట్లు చెప్పారు. మిగతా 33శాతం త్వరగా పూర్తి చేయాలని రేషన్‌షాప్ డీలర్స్‌ను ఆదేశించారు. డీలర్స్ అందరూ ఎఫ్‌పీ షాప్‌లో సమయపాలన పాటించాలని, దుకాణంలో స్టాక్‌బోర్డు తప్పకుండా పెట్టాలన్నారు. ఈ విషయమై ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ఇన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు, రేషన్‌షాప్ డీలర్స్‌తో సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. డీలర్స్ అందరూ ఈకేవైసీపై శ్రద్ధ వహించి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ శ్రీనివాస్, డీఎం సివిల్ సప్లయ్ రవినాయక్, డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


