గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించనున్నందున అందుకనుగుణంగా వేదిక, సీటింగ్ ఏర్పాట్లను చేయాలని ఆర్‌డీఓను ఆదేశించారు. వివిధ శాఖల అభివృద్ధి ప్రగతి నివేదికలు ముఖ్య అతిథి సందేశం కోసం అందజేయాలని సూచించారు. ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని డీఆర్‌ఓ, కలెక్టరేట్ ఏఓను ఆదేశించారు. గౌరవ వందనం పోలీస్‌శాఖ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ, ఇతర శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసేందుకు ఈ నెల21లోగా జాబితా రూపొందించాలన్నారు. అన్ని శాఖల అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్‌నాయక్, ఆర్‌డీఓ నవీన్, డీఆర్‌డీఓ నర్సింహులు, సీపీఓ రవీందర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మహిళలకు వడ్డీ లేని
రుణాలు పంపిణీ చేయాలి
కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. సోమవారం కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీసీ నిర్వహించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టాలన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీకి డీఆర్‌డీఓ నర్సింహులు, దేవరకద్ర మున్సిపాలిటీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామిరెడ్డిలను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు.


