అతివలకు పెద్దపీట
పాలమూరు: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ డివిజన్లతోపాటు ఇతర మున్సిపాలిటీ వార్డులో సైతం మహిళలకు పెద్దపీట వేశారు. ఈసారి పట్టణా ల్లో నివాసం ఉండే అన్నివర్గాల మహిళలకు ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం కల్పించడానికి అధిక మొత్తంలో స్థానాలు కేటాయించడం వల్ల భర్త చాటున ఉండే భార్యామణులు పోటీకి సై అంటున్నారు. గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన మహిళలు ఇప్పుడు కార్పొరేటర్లుగా పోటీగా సిద్ధమవుతున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో 30 వార్డులు మహిళలకు కేటాయించడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీల నేతలు వారి భార్యలు, తల్లులను రంగంలోకి దింపడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల కేటాయింపులు సైతం పూర్తి కావడంతో పార్టీ పరంగా టికెట్ తెచ్చుకోవడానికి ఆయా పార్టీల్లో ఉండే ఆశావహులు లాబీయింగ్ చేయడం మొదలుపెట్టారు. అధికార పార్టీ నుంచి ప్రతి డివిజన్‌లో ముగ్గురు నలుగురు పోటీ పడుతున్న క్రమంలో ఎవరికి టికెట్ కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠగా ఉంది. ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో యువత అధిక మొత్తంలో పోటీలో ఉండటం వల్ల రాజకీయం పూర్తిగా హాట్‌హాట్‌గా ఉండనున్నాయి.
గెలుపు వ్యూహాలు
కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలు రూ పొందించే దిశగా అడుగులు వేస్తున్నాయి. వార్డులు, డివిజన్ల వారీగా ఎవరికి టికెట్ ఇస్తే విజయావకాశా ఎక్కువగా ఉంటాయో ముఖ్య నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. నిన్నటి వరకు బరిలో మేమంటే మేముంటామంటూ ఆశించిన నాయకులంతా రిజర్వేషన్లు వెల్లడయ్యే సరికి అనుకూలంగా లేనిచోట్ల వెనక్కి తగ్గారు. అనుకూలమైన రిజర్వేషన్ రాకపోవడంతో తటస్థంగా ఉండేందుకు నిర్ణయించుకుంటున్నారు. మరోవైపు గెలుపు గుర్రాలకే టికె ట్లు ఇవ్వాలన్న లక్ష్యంగా ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఆశావహుల జాబితా తయారు చేసిన క్రమంలో ఇందులో గెలుపు కోసం అభ్యర్థుల వడపోతకు సిద్ధమవుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారితోపాటు ఆయా డివిజన్, వార్డు ప్రజల్లో గుర్తింపు ఉన్నవారికి టికెట్ ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. ఇందుకోసం సర్వేల ద్వారా గుర్తించి ఎవరూ ముందంజలో ఉన్నారో వారికే బీఫాం ఇవ్వాలని చూస్తున్నారు.
కార్పొరేషన్‌లో 30 డివిజన్లు, మున్సిపాలిటీల్లో 25 వార్డులు కేటాయింపు
ఆశావహుల్లో అర్హుల ఎంపికపై ప్రధాన పార్టీల దృష్టి
ప్రత్యేక సర్వేల ద్వారా అభ్యర్థుల వడబోత
ఆర్థిక బలం, ప్రజల్లో గుర్తింపు ఉన్నవారికే అవకాశం
అతివలకు పెద్దపీట


