ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): నూతనంగా ఎన్నికై క గ్రామ సర్పంచ్‌లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు మనసులు మెచ్చేలా పాలన సాగించాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అన్నారు. సోమవారం స్థానిక దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రాంగణంలో నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు శిక్షణను సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించి.. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. నిష్పక్షపాతంగా గ్రామాల్లో పనిచేయాలని, పల్లె పాలనపై పట్టు సాధించాలన్నారు. పల్లెలో సుపరిపాలన బాటలు దిశగా అడుగులు, వేయాలని, గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. మొదటి విడతగా హన్వాడ, మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్, గండేడ్ మండలాల సర్పంచ్‌లు హాజరవుతున్నట్లు చెప్పారు. ఎనిమిదిమంది మాస్టర్ ట్రైనర్లు సర్పంచులు నిర్వహించాల్సిన విధులు, నెరవేర్చాల్సిన బాధ్యతలు, గ్రామ పంచాయతీ బడ్జెట్, పరిపాలన, తదితర విషయాల మీద శిక్షణ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ, పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీపీఓ వెంకట్‌రెడ్డి, ట్రైనీ డీపీఓ నిఖిల, తదితరులు పాల్గొన్నారు.


