జాతరకు వెళ్లి వస్తుండగా..
● అతివేగంతో ట్రాక్టర్‌ను ఢీకొన్న డీసీఎం
● వ్యక్తి మృతి, ఎనిమిది మందికి గాయాలు
ఎర్రవల్లి: జాతీయ రహదారి పై దైవదర్శనానికి వెళ్లి వస్తున్న ఓ ట్రాక్టర్‌ను డీసీఎం ఢీ కొట్టడంతో ఒకరు మృతిచెందగా.. ఎనిమిది మందికి గాయాలైన ఘటన కోదండాపురం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై తరుణ్ కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్నూల్ జిల్లాలోని పంచలింగాలకు చెందిన ఖాజాన్‌గౌడ్(45) తమ కుటుంబ సభ్యులతోపాటు మరికొంతమంది గ్రామస్తులతో కలిసి (మొత్తం 14మంది) ట్రాక్టర్‌లో ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని సింగోటం జాతరకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అదేరోజు రాత్రి జాతీయ రహదారిపై వేముల స్టేజీ సమీపంలో వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను హైదరాబాద్ నుంచి కేరళ వెళ్తున్న ఓ డీసీఎం అతివేగంతో వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్‌తోపాటు ట్రాలి ఒక్కసారిగా బోల్తా పడడంతో అందులో ఉన్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలు కాగా, మరో ఐదుగురికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. గమనించిన వాహనదారులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో కర్నూల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఖాజాన్‌గౌడ్ మార్గం మధ్యంలోనే మృతిచెందినట్లు డ్యూటీ డాక్టర్ ధ్రువీకరించినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు నరేంద్రగౌడ్ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్ ఉపేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


