‘దక్కన్’ గొర్రెల పరిశోధన కేంద్రం తరలింపు తగదు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దక్కన్ జాతి గొర్రెల పరిశోధన స్థానం తరలింపును విరమించుకోవాలని తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ డిమాండ్ చేశారు. పరిశోధన నిమిత్తం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బండమీదిపల్లి పరిశోధన కేంద్రంలో ఉన్న 150 దక్కన్ జాతి గొర్రెలను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వెటర్నరీ కేంద్రానికి తరలించడం సరైంది కాదన్నారు. ఆదివారం శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో ప్రచురితమైన శ్రీదక్కనీశ్రీ గుర్తింపు అనే కథనం ఆధారంగా ఆయన స్పందిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల కాపరులకు ఎంతో చేయూతనందించారని గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటు అయిందని చెప్పారు. దక్కన్ జాతి గొర్రెలు సమాజానికి రుచికరమైన మాంసం అందిస్తాయని పేర్కొన్నారు. దక్కన్ జాతిని సంరక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రాన్ని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నించడం తగదన్నారు. సదరు పరిశోధన కేంద్రానికి ప్రభుత్వాలు ఇచ్చిన వందల ఎకరాల భూములను పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కేటాయింపులు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం తన ఆలోచన విరమించుకోకపోతే సబ్బండ వర్గాలను కూడగట్టి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఉత్సాహంగా వాలీబాల్ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్‌లోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా సీనియర్ పురుష, మహిళా జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలకు ముఖ్య అతిథిగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శాంతికుమార్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాలీబాల్ టోర్నమెంట్‌లో కోచ్‌లు అందజేసిన శిక్షణ ప్రదర్శిస్తే విజయాలు సాధింవచ్చన్నారు. టోర్నీలో క్రీడాస్ఫూర్తిని చాటాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మహ్మద్ హనీఫ్, ఉపాధ్యక్షులు బాలస్వామి, కార్యనిర్వాహక కార్యదర్శులు చెన్నవీరయ్య, సమద్‌ఖాన్, గులాం యాసిన్‌ఖాన్, డీఎస్‌ఏ వాలీబాల్ కోచ్ పర్వేజ్‌పాష తదితరులు పాల్గొన్నారు.
బస్సులు ఆపడం లేదని ఆందోళన
మన్ననూర్: శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలో మన్ననూర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని మహిళలు ఆందోళన చేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు మన్ననూర్ స్టేజీ నుంచి వివిధ డిపోల నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు అధికంగా రాకపోకలు సాగిస్తాయి. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిసర ప్రాంతాల నుంచి ప్రయాణికులు మద్దిమడుగు తదితర బస్సుల ద్వారా మన్ననూర్ స్టేజీ వరకు వచ్చి, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లేందుకు బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం, ముఖ్యంగా కార్తీక మాసం పర్వదినాలు కావడంతో మహిళలకు ఫ్రీ చార్జీగా ఉండే ఎక్స్‌ప్రెస్ బస్సులు అప్పటికే నిండడంతో మన్ననూర్ స్టేజీ వద్ద ఆపకుండా వెళ్లాయి. దీంతో కోపోద్రిక్తులైన మహిళలు బస్సులు ఎందుకు ఆపడం లేదని రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఇది ఇలా ఉండగా డీలక్స్, సూపర్ డీలక్స్, ఏసీ బస్సులు మన్ననూర్ స్టేజీ వద్ద ఉన్న ప్యాసింజర్‌ను చూసి ఆపితే ఏ ఒక్కరూ ఎక్కకపోవడం గమనార్హం. ఎంతసేపు ఆధార్ ఆధారిత ఫ్రీగా ఉండే బస్సులను మాత్రమే ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
● బీసీ కులాల ఐక్య వేదిక
రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్


