ఉత్కంఠగా జిల్లా క్లబ్ కార్యవర్గ ఎన్నికలు
పాలమూరు: జిల్లా క్లబ్ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠగా సాగాయి. ఈసారి రాజకీయ నేతల ప్రమేయం పెరగడంతో రాజకీయ ఎన్నికలను తలపించాయి. ప్రధాన కార్యదర్శి పోస్టుకు కాంగ్రెస్ నేత సంజీవ్ ముదిరాజ్‌తో పాటు మల్లు నర్సింహ్మారెడ్డి మధ్య పోటీ కొనసాగింది. ఇక ఇతర పోస్టులకు బరిలో ఉన్న వారందరూ విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. పార్టీల నేతలు అక్కడే తిష్టవేసి వారి అభ్యర్థులను గెలిపించుకోవడానికి పావులు కదిపారు.
● జిల్లా క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు క్లబ్‌లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే జిల్లా క్లబ్ అధ్యక్షుడిగా నాగేశ్వర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. మిగిలిన కార్యవర్గం ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా క్లబ్‌లో మొత్తం 2,045 మంది ఓటర్లు ఉండగా.. 1,169 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ నేతలు, న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారులు క్లబ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఉపాధ్యక్షుడి పోస్టుకు ముగ్గురు, ప్రధాన కార్యదర్శికి నలుగురు, సంయుక్త కార్యదర్శికి ముగ్గురు, స్పోర్ట్స్ జాయింట్ కార్యదర్శి పదవికి ఇద్దరు, కోశాధికారి పోస్టుకు ముగ్గురు, ఈసీ సభ్యుల పోస్టులకు 12మంది పోటీ చేయగా.. వీరిలో ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
రెండేళ్లకు ఒకసారి..
జిల్లా క్లబ్ 1958లో ఏర్పాటు కాగా.. ఆనాటి నుంచి ప్రతి రెండేళ్లుకు ఒకసారి నూతన కార్యవర్గం ఎన్నుకుంటున్నారు. జిల్లా క్లబ్‌లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సభ్యులు ఉన్నారు. గతంలో రూ. లక్ష ఉన్న సభ్యత్వాన్ని ప్రస్తుతం రూ. 3లక్షలుగా నిర్ణయించారు. చివరగా 2023లో ఎన్నికలు జరిగాయి.
● రాజకీయ ఎన్నికలను తలపించిన వైనం
● ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్న ఎమ్మెల్యేలు,
మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు


