హైవే పోలీసుల చేతివాటం!
● హార్వెస్టర్ డ్రైవర్ల నుంచి
లంచం వసూలుకు యత్నం
జడ్చర్ల: పట్టణ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న హార్వెస్టర్ డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు జాతీయ రహదారి భద్రతను పర్యవేక్షించే పోలీసులు ప్రయత్నించారు. ఆదివారం తమిళనాడు నుంచి కరీంనగర్‌కు జాతీయ రహదారిపై దాదాపు 40 హార్‌వెస్టర్లు వరుస క్రమంలో వెళ్తున్నాయి. అయితే జడ్చర్ల శివారులోకి రాగానే జాతీయరహదారి భద్రతను పర్యవేక్షించే పోలీసులు వాటిని ఆపి రోడ్డుపై బేరసారాలు కొనసాగించారు. ఒక్కో హార్‌వెస్టర్‌కు రూ.500 చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆయా డ్రైవర్లు రూ.200 ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విషయం మీడియాకు తెలిసి అక్కడకు చేరుకునే లోపు సంబంధిత పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే హార్‌వెస్టర్లకు రోడ్డుపై ప్రయాణించే పర్మిట్ ఉంటుందని, ఇందుకు సంబంధించి పన్నులు కూడా రిజిస్ట్రేషన్ సమయంలోనే కడతామని హర్వెస్టర్ యాజమానులు, డ్రైవర్లు తెలిపారు. అయినా జాతీయ రహదారి పోలీసులు తమను వెంటాడి డబ్బులు డిమాండ్ చేశారని వాపోయారు.


