నేడే ఉద్దాల మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడే ఉద్దాల మహోత్సవం

Oct 28 2025 9:00 AM | Updated on Oct 28 2025 9:00 AM

నేడే

నేడే ఉద్దాల మహోత్సవం

● కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో

ప్రధాన ఘట్టం

● భారీ పోలీసు బందోబస్తు నడుమ

పాదుకల ఊరేగింపు

● వేలాదిగా తరలిరానున్న భక్తజనం

చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం మంగళవారం (నేడు) అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారి పాదుకలను దర్శించుకుంటారు. ఉద్దాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం పల్లమర్రి నుంచి చాటను ట్రాక్టర్‌పై ఊరేగింపుగా వడ్డేమాన్‌ గ్రామంలోని ఉద్దాల మండపానికి తీసుకొస్తారు. పాదుకలకు మండపం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం చాటలో పాదుకలను ఉంచి భారీ పోలీసు భద్రత మధ్యన అప్పంపల్లి ఊకచెట్టు వాగు నుంచి వ్యవసాయ పొలాల మీదుగా తిర్మలాపూర్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై కురుమూర్తి గుట్టకు తరలిస్తారు. స్వామివారి పాదుకలను తాకి పునితులయ్యేందుకు భక్తులు పోటీ పడతారు. దీంతో చిన్నవడ్డేమాన్‌, ఊకచెట్టు వాగు, అప్పంపల్లి, తిర్మలాపూర్‌ గ్రామాలతో పాటు కురుమూర్తి స్వామి ఆలయం వరకు జనసంద్రంగా మారుతుంది.

నియమ నిష్టలతో పాదుకల తయారీ..

చిన్నవడ్డేమాన్‌లో 60 దళిత కుటుంబాలకు చెందినవారు ఉద్దాల తయారీలో పాల్గొంటారు. కార్తీక అమావాస్య నుంచి ఏడురోజుల పాటు నియమ నిష్టలతో ఒంటిపూట భోజనం చేస్తూ.. కురుమూర్తి స్వామి, పద్మావతి అమ్మవార్ల పాదుకలను తయారు చేస్తారు. పాదుకలను ఆవు చర్మం, వన్నెలాకు తగురము, పచ్చపూసలు, టేన్‌పోగులు, తగ్గి, వైనం, రేషం, పట్టు తదితరవాటితో తయారు చేస్తారు. సప్తమి నాడు ఈ పాదుకలను ఊరేగింపుగా కురుమూర్తిగిరులకు చేరుస్తారు.

230 ప్రత్యేక బస్సులు..

కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలిరానుండగా.. అందుకు తగ్గట్లు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యంగా మంచినీరు, పారిశుద్ధ్యం, వైద్యం, ట్రాఫిక్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతర ప్రాంగణంలో ఆరోగ్య వైద్యకేంద్రం, ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు సీకుల దర్శనం, సర్వ దర్శనం ద్వారాలు.. భక్తుల సెల్‌ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో 4 ఓహెచ్‌ఆర్‌ వాటర్‌ ట్యాంకులతో పాటు అక్కడక్కడ 8 మినీ వాటర్‌ ట్యాంకులు, 8 స్టాండ్‌ పోస్టు మంచినీటి వాటర్‌ ట్యాంకులు నిర్మించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు 100 ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు నుంచి అన్ని రూట్లలో 230 బస్సులు నడపనున్నారు.

ఉద్దాల ఉత్సవానికి ముందురోజు కొనసాగే తలియకుండ ఉత్సవం అప్పంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి వైభవంగా కొనసాగింది. గ్రామంలోని శాలివాహన కాలనీలో ఉన్న తలియకుండ మండపంలో కుండకు శాలివాహనులు పూజలు జరిపారు. అనంతరం వారు కుండను తలపై పెట్టుకొని మేళతాళాల మధ్య బాణసంచా కాలుస్తూ.. ఊరేగింపుగా చిన్నవడ్డెమాన్‌ గ్రామంలోని ఉద్దాల మండపానికి తరలించారు. ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

680 మంది పోలీసులతో బందోబస్తు

కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతరకు క ట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కల్పిస్తామని ఎ స్పీ డి.జానకి అన్నారు. మంగళవారం ఉద్దాల మ హోత్సవం ఉండటంతో సోమవారం జాతర మైదానాన్ని పరిశీలించి మాట్లాడారు. జాతర స మయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా దైవ దర్శనానికి సాఫీగా వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. సిబ్బంది అందరూ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఉద్దాల ఉత్సవం సందర్భంగా 680 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు కల్పిస్తామన్నారు. జాతర ప్రాంగణంలో మొత్తం సీసీ కెమెరాలు, 24 గంటలు కంట్రోల్‌ రూం ఏర్పాటు ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య వస్తే డయల్‌ 100కు సమాచా రం ఇవ్వాలని కోరారు. ఎస్పీ వెంట ఏఎస్పీ ఎన్‌ బీ రత్నం, ఏఆర్‌ ఏఎస్పీ సురేష్‌కుమార్‌, డీఎస్పీ లు వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.

నేడే ఉద్దాల మహోత్సవం 1
1/3

నేడే ఉద్దాల మహోత్సవం

నేడే ఉద్దాల మహోత్సవం 2
2/3

నేడే ఉద్దాల మహోత్సవం

నేడే ఉద్దాల మహోత్సవం 3
3/3

నేడే ఉద్దాల మహోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement