యువత రాజకీయాల్లోకి రావాలి
కందనూలు/కల్వకుర్తి రూరల్: యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. ఆయన చేపట్టిన సామాజిక చైతన్య రథయాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది, మలి దశ ఉద్యమంలో 1200 మంది చేసిన ఆత్మబలిదానాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అయితే నేటికీ ఒక భౌగోళిక తెలంగాణగానే మిగిలిపోవడం.. బహుజనులకు అధికార పగ్గాలు అందకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 6వేల కోట్లతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకారానికి రూ. 25వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎల్‌డీ నాయకులు ముద్దం మల్లేష్, రిషబ్ జైన్, జానీ, నర్సింహారావు, సుధాకర్ పాల్గొన్నారు.
● జిల్లా కేంద్రం నుంచి కల్వకుర్తికి సామాజిక చైతన్య రథయాత్ర చేరుకోగా.. పాలమూరు చౌరస్తాలో దిలీప్‌కుమార్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ ఆర్థికంగా, రాజకీయంగా రాణించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఫాం అడిగే స్థాయి నుంచి బీఫాం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, జంగయ్య, సదానందంగౌడ్, గోపాల్, రమేశ్ బాబు, శ్రీనివాసులు, శేఖర్, రాములు యాదవ్ పాల్గొన్నారు.


