
యువత నైపుణ్యం పెంచుకోవాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణం పెంచుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్మాణ్ ఓఆర్‌జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు నైపుణ్యంతో పాటు నాణ్యతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు దక్కాలంటే ఆధునిక సాంకేతికతతో పాటు సరైన పరిజ్ఞానం ఎంతో అవసరమన్నారు. దీని కోసం స్థానికంగా టాస్క్, అమరరాజా, సెట్విన్ సంస్థల స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ మేళాకు సుమారు 20 కంపెనీల ప్రతినిధులు హాజరై.. అక్కడికి వచ్చిన సుమారు 270 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వివిధ దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి 120 మందిని ఎంపిక చేశారు. వీరికి ఉద్యోగ స్థాయిని బట్టి కనీస నెల వేతనం రూ. పది వేల నుంచి రూ.25 వేల వరకు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.