
జూరాలకు 62 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ఎత్తివేత
● 65,140 క్యూసెక్కుల నీరు దిగువకు
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 79 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శనివారం రాత్రి 8.30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 62 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు తాత్కాలికంగా నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టు కేవలం 3 క్రస్టు గేట్లను ఎత్తి 18,384 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 45,055 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 65,140 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.132 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
వేగవంతంగా విద్యుదుత్పత్తి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 408.044 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 394.443 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కలిపి 802.487 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.
శ్రీశైలం ఆనకట్ట ఒక గేటు ఎత్తివేత
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టినా శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టానికి మించి నీరు నిల్వ ఉండడంతో సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 63,439 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 11,238, హంద్రీ నుంచి 250 మొత్తం 74,927 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తోంది. శ్రీశైలంలో ఆనకట్ట వద్ద ఒక్క గేటును పది అడుగుల మేర పైకెత్తి స్పిల్‌వే ద్వారా 27,983 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,819 మొత్తం 66,134 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.8 అడుగుల వద్ద 214.8450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేలు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,835, ఎంజీకేఎల్‌ఐకు 866 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.990 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 13.747 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.