
కంటివైద్యుడి అదృశ్యంపై వీడిన మిస్టరీ
మద్దూరు: పట్టణంలో కంటి ఆస్పత్రి నిర్వహిస్తున్న కంటివైద్యుడు పాత్లావత్ రమేశ్‌నాయక్ ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ 17 పేజీల లేఖ రాసి గత నెల 28న అదృశ్యమైన విషయం పాఠకులకు విధితమే. శనివారం హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు బస్సులో వస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు మార్గమధ్యంలో పట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విలేకర్ల ఎదుట ప్రవేశపెట్టారు. మతమార్పిడులు, దొంగ బంగారం, హవాల తదితర అంశాలు ఊహించి రాసి డబ్బుల గురించి వేధించే వారికి తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంలో ఇదంతా చేసినట్లు విచారణలో వెల్లడైందని కోస్గి సీఐ సైదులు తెలిపారు. రమేష్‌నాయక్‌ను తహసీల్దార్ ఎదుట హాజరుపర్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. న్యాయ సలహా మేరకు కేసుపై తదుపరి చర్యలుంటాయని చెప్పారు. రమేష్‌నాయక్‌ను పట్టుకునేందుకు కృషిచేసిన టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ పురుషోత్తం, మద్దూరు ఎస్‌ఐ విజయ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ వసురాంనాయక్, పోలీసులు పరశురాంనాయక్, నాగమల్లేష్, పూల్చ్యానాయక్, రాఘవేందర్‌రెడ్డి, హన్మంతు తదితరులను సీఐ అభినందించారు.
వేధింపులతోనే ఇదంతా చేశా..
కంటి వైద్యుడు రమేష్‌నాయక్ పోలీసుల ఎదుట జరిగిన విషయాన్ని విలేకర్లకు వివరించారు. తన మిత్రుడు రామచంద్రయ్య గతంలో పట్టణంలోని తాజోద్దీన్ వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకోగా తాను జమానత్ ఉన్నానన్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ ఏడాది మే నెల 23న ఆత్మహత్య చేసుకున్నాడని.. తనను పిలిచి డబ్బులు చెల్లించాలంటూ తాజోద్దీన్ ఒత్తిడి పెంచి తరచూ వేధిస్తున్నట్లు వివరించారు. డబ్బులు చెల్లించాలని మళ్లీ స్నేహితుల సమక్షంలో మరో బాండ్ పేపర్ రాయించుకున్నారని, దీంతో చేసేది లేక నెల వడ్డీ చెల్లించినట్లు చెప్పారు. వేధింపులకు తట్టుకోలేక సినిమాల ప్రభావంతో మతమార్పిడులు, దొంగ బంగారం, హవాల డబ్బులు తదితర వాటిని పేర్కొంటూ లేఖ రాసినట్లు తెలిపారు.
విలేకర్ల ఎదుట హాజరుపర్చిన పోలీసులు