
రసాయనాలు కలిసిన నీరు తాగి నెమళ్లకు అస్వస్థత
● వనపర్తి ఎస్పీ చొరవతో
పశువైద్యశాలకు తరలింపు
● పోలీసు, ఫారెస్టు అధికారుల
పర్యవేక్షణలో చికిత్స
వనపర్తి: పంటపొలంలో రసాయనాలు కలిసిన నీటిని తాగి అస్వస్థతకు గురైన మూడు నెమళ్లకు పశువైద్యులు చికిత్స అందించి ఊపిరి పోశారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్ల–తిరుమలాపురం రోడ్డు పక్కనున్న పొలంలో రైతు కంతుల కురుమయ్య మినుముల పంట సాగుచేశాడు. ఇటీవల పంటకు రసాయనిక ఎరువులు వేశాడు. శనివారం అటుగా వచ్చిన మూడు నెమళ్లు పొలంలో నిలిచి ఉన్న నీటిని తాగడంతో అస్వస్థతకు గురై కదలలేని పరిస్థితికి చేరుకున్నాయి. గమనించిన సమీప రైతులు ఫారెస్టు అధికారులు, పోలీసులతో పాటు స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రావుల గిరిధర్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి గోపాల్‌పేట ఎస్‌ఐ నరేశ్‌తో పాటు ఎస్‌బీ కానిస్టేబుల్ బాలును పంపించారు. అక్కిడికి వెళ్లిన వారు మూడు నెమళ్లు కదలలేని స్థితిలో ఉన్నాయని ఎస్పీకి సమాచారం ఇవ్వగా.. వెంటనే వాటిని వనపర్తి జిల్లా కేంద్రంలోని పశువైద్యశాలకు తీసుకురావాలని సూచించారు. వారు పశువైద్యశాలకు నెమళ్లను తీసుకొచ్చే వరకే ఆయన అక్కడికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ మల్లేశ్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. నెమళ్లను తీసుకొచ్చిన వెంటనే చికిత్స మొదలుపెట్టారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుకొని వైద్యం అందించాలని వైద్యుడు సూచించడంతో.. వనపర్తి ఫారెస్టు సెక్షన్ అధికారులు విజయ్, స్వప్నకు నెమళ్లను అప్పగించారు. వారు స్థానిక ఎకో పార్క్‌కు తరలించి తమ పర్యవేక్షణలో ఉంచుకున్నారు. అవి పూర్తిగా కోలుకున్న తర్వాత అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఎక్కడైనా మూగజీవాలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాటిని కాపాడే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.