
శ్రీశైలానికి స్వల్పంగా వరద
దోమలపెంట: శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెరిచి ఉన్న ఒక్క గేటును రాత్రి అధికారులు మూసివేశారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 45,587, సుంకేసుల నుంచి 8,892 మొత్తం 54,479 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 27,142 మొత్తం 62,457 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.6 అడుగుల వద్ద 213.4011 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,835 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.264 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.398 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
రెండు గేట్ల ద్వారా నీటి విడుదల
రాజోళి: సుంకేసుల డ్యాం రెండు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఆదివారం జేఈ మహేంద్ర తెలిపారు. ఎగువ నుంచి 15,250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. రెండు గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 11,156 క్యూసెక్కులు విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులు విడుదల చేసినట్లు జేఈ పేర్కొన్నారు.
కోయిల్‌సాగర్ గేట్ల మూసివేత
దేవరకద్ర: ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. పెద్దవాగు ఇన్‌ఫ్లో తగ్గడంతో ఆదివారం ఉదయం ఒక్క గేటును తెరవగా మధ్యాహ్నం నుంచి ఆ గేటును మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32.4 అడుగులుగా ఉంది.
జూరాల గేట్ల మూసివేత
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గడంతో తెరిచి ఉంచిన గేట్లను మూసివేసినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 9.30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 55 వేల క్యూసెక్కులకు తగ్గిందన్నారు. జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లను కొనసాగించి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 45,527 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 47,228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.255 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
811.700 ఎంయూ విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుంచి వరద భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఆదివారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వార 234 మెగావాట్లు, 412.937 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 398.763 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 811.700 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు తెలిపారు. ఉత్పత్తికి గానూ 45,587 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు పేర్కొన్నారు.