
చీరాల బీచ్‌లో జడ్చర్ల విద్యార్థి దుర్మరణం
జడ్చర్ల: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జడ్చర్లకు చెందిన ఓ విద్యార్థి ఆదివారం సెలవు రోజున ఆటవిడుపు కోసం మిత్రులతో కలిసి సముద్ర తీరాలకు వెళ్లి సముద్రం అలలలో కొట్టుకుపోయి నీట మునిగి మృతిచెందాడు. బంధువుల కథనం మేరకు.. జడ్చర్ల గంజ్ ప్రాంతానికి చెందిన బాదం సాయి మణిదీప్(20) ఏపీలోని అమరావతి వద్ద ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్య నభ్యసిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఏడుగురు మిత్రులతో కలిసి ఆటవిడుపు కోసం చీరాల బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లోని ససముద్రం అలలలో ఎనిమిది మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు విద్యార్థులను కాపాడగా.. ఐదుగురు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. వీరిలో జడ్చర్లకు చెందిన విద్యార్థి సాయి మణిదీప్ ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు బాదం రాఘవేందర్, కల్యాణి ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. కన్నీరు మున్నీరై విలపించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విద్యార్థి మృతిపై ఆరా తీసి విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని త్వరితగతిన జడ్చర్లకు తీసుకొచ్చే విధంగా సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేశారు.