
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మంగళ హారతితో స్వాగతం పలుకుతున్న మహిళలు
తాడూరు: బీఆర్‌ఎస్ పాలనలో అక్రమాలకు గ్రామాలు నిలయంగా మారాయని, అవినీతి రాజ్యమేలుతోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని పాపగల్, సిర్సవాడ, బలాన్‌పల్లి గ్రామాల్లో పర్యటించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపగల్‌లో ప్రభుత్వం గతంలో దళితులకు ఇచ్చిన భూముల్లోని నల్లమట్టిని స్థానిక నాయకులు విక్రయించి అక్రమంగా సంపాదించారన్నారు. సిర్సవాడ, తాడూరు మండల కేంద్రంలో పాఠశాల భవన నిర్మానాల పేరుతో ఇసుకను విక్రయించారన్నారు. ఇసుక విక్రయంతోనే పాఠశాలల నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. ఒకప్పుడు గ్రామాలు పచ్చనిపొలాలతో కళకళలాడేవని, ప్రస్తుతం బీఆర్‌ఎస్ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. పల్లెప్రగతిలో భాగంగా సర్పంచ్‌లు చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకపోవడంతో సర్పంచ్‌ల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. లిక్కర్ స్కాంలో ఇరికిన ఎమ్మెల్సీ కవితను కాపాడుకోవడంలోనే నిమగ్నమై.. గ్రామాల అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. స్థానికంగా ఉండే బీఆర్‌ఎస్ నాయకుల అక్రమాలు మితిమీరిపోయాయన్నారు. అనంతరం సిర్సవాడ, బలాన్‌పల్లి, ఐతోల్ గ్రామాల్లో పర్యటన సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుమార్, నాయకులు రామకృష్ణ, పృథ్వీరాజ్, శివశంకర్, రామకృష్ణ, రాములమ్మ, బాలు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.